ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇండియా 365 పరుగులు చేసింది.
తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 25 పరుగులతో పరాజయంపాలైంది.
ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది.
దీంతో కోహ్లీ సేన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ సిరీస్‌ను చేజింక్కించుకున్న టీమిండియా WTC పాయింట్ల పట్టికలో 72.2% విజయాలతో నెం.1 స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 70.0% విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది.
దీంతో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకూ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
గెలిచిన జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌గా నిలుస్తుంది.
2019, ఆగస్టు 1న ఐసీసీ ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ప్రారంభించింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మొత్తం తొమ్మిది దేశాలు ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడ్డాయి.
ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడాయి.
అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్.
పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కి అర్హత సాధించాయి.
నిజానికి ఫైనల్ రేసులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా నిలిచాయి.
కానీ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనని రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా ఈ రేసులో వెనకబడిపోయింది.
భారత్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఒకవేళ అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓడివుంటే ఆస్ట్రేలియా రెండో స్థానానికి ఎగబాకి ఫైనల్‌కి అర్హత సాధించేది.
పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా (69.2%), ఇంగ్లాండ్ (61.4%), పాకిస్థాన్ (43.3%) టాప్-5లో నిలిచాయి.