ఇండియా, ఇంగ్లండ్ మధ్య చివరి, 4వ టెస్టు మ్యాచ్ గురువారమిక్కడ ప్రారంభమైంది. సిరీస్ ఎవరిదో నిర్ణయించే ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే అసక్తికరంగా మారింది.
నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇండియా 2, ఇంగ్లండ్ 1తో ఉన్నాయి.
మూడో టెస్టు కూడా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లు సత్తా చాటడంతొ ఆ మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగిసింది.
దీనిపై అనేక విమర్శలు ప్రతి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే ప్రారంభమైన నాలుగో మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచ్‌లోనూ భారత స్పిన్నర్లు సత్తా చాటారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైంది.
మరోసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో తడబడ్డారు. 75.5 ఎవర్లోనే ఇంగ్లండ్ కుప్పకూలింది.
ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (55), డాన్ లెరెన్స్ (46) మినహా మిగతావారెవ్వరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 66 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోగా.. రవిచంద్రన్ అశ్వన్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా.. వాషింగ్టన్ సుందర్‌కు 1 వికెట్ దక్కింది.
మూడో టెస్టు విమర్శల నేపథ్యంలో ఆఖరి టెస్ట్ కోసం ఫ్లాట్ పిచ్ సిద్దం చేశారు. అయినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది.
గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులతో, వన్ డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి టీమిండియా 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 181 పరుగులు వెనకబడివుంది.