సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులకు నియమావళి

6988
rules-and-regularisations-for-sarpanch-ward-member-applicants

వార్డు మరియు సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఓ కరదీపిక విడుదల చేసింది. అందులోని ముఖ్య విషయాలు మీకోసం..

పోటీచేసే అభ్యర్థికి కొత్త ఖాతా..

* ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడానికి ఎన్నికల ఖర్చు నిమిత్తం ప్రతి అభ్యర్థి ఒక ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి. అభ్యర్థి నామినేషన్ పేపరు దాఖలు చేయడానికి కనీసం ఒక రోజు ముందు ఈ ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది.
* నామినేషన్ దాఖలు చేసినప్పుడు సదరు అభ్యర్థి ఈ బ్యాంకు ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి లిఖతపూర్వకంగా తెలుపాలి.
* ఈ ఖాతా నుంచే అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈ బ్యాంకు ఖాతాలో చూపడంతో పాటు ఖర్చు చేయాల్సి ఉంటుంది.



అక్షర మాల ప్రకారం గుర్తులు

* తుది జాబితాను తెలుగు అక్షర క్రమం లో రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
* సర్పంచ్, వార్డు మెంబర్‌కు సంబం ధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తుల ప్రకటనను ముందుగా జారీచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుల జాబితా నుంచి రిటర్నింగ్ అధి కారి వరుసగా అభ్యర్థులకు కేటాయి స్తారు. u పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమంలో ప్రకటించిన జాబితా ప్రకారమే గుర్తులు కేటాయి స్తారు. అంటే ఉదాహరణకు చూస్తే సర్పంచ్ పదవి కోసం పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితాలో మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన జాబితా లోని మొదటి గుర్తును కేటాయిస్తారు. రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయి స్తారు. ఇదే విధానం వార్డు సభ్యులకు వర్తిస్తుంది. u ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉంటే నామినేషన్ వరు స సంఖ్య అధారంగా తీసుకుంటారు.
* బ్యాలెట్ పత్రంలో గుర్తుల కేటాయింపు పూర్తి ఆయ్యాక నోటా చేర్చుతారు.

ఇలా ఉంటే పోటీకి అనర్హత

* నేర ప్రవృత్తితో నేరం చేసి క్రిమినల్ కోర్టు ద్వారా కారాగార శిక్ష పడి ఉండవద్దు. అంతేకాదు.. శిక్ష ముగి సినా ఆ తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలం వరకు అనర్హత వర్తిస్తుంది.
* 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం నేరానికి పాల్పడి శిక్ష ఉండరాదు.
* 1994 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని 19ఏ, 19బీ, 20ఏ విభాగాల ప్రకారం అనర్హులై ఉండవద్దు.
* మతిస్థిమితం, చెవిటి, మూగ వారు అనర్హులు
* దివాలా తీసిన, దివాలాతనం నుంచి బయటకు రాలేని వ్యక్తిగా న్యాయస్థానం నిర్ణయించిన వారు అయి ఉండరాదు. ఇందుకోసం దరఖాస్తు చేసుకు న్న వారు కూడా అనర్హులే.
* గ్రామ పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తు లేదా ఏదేనీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా కాంట్రాక్టు పొంది ఉండరాదు.
* పారితోషికం తీసుకుంటూ గ్రామ పంచాయతీ తరపున, లేదా వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టిషనరుగా పనిచేస్తూ ఉండరాదు.
* ప్రస్తుత లేదా గత అర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి ఉండి.. అట్టి బకాయి చెల్లించాల్సిందిగా నోటీసు ఇచ్చిన తదుపరి గడువు ముగిసినా బకాయి చెల్లించని వారు అనర్హులే.
* చట్టంలోని 19(3) ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండవద్దు.

పోలింగ్ రోజున అనుసరించాల్సినవి

* పోలింగ్ స్టేషన్‌కు వంద మీటర్ల దూరం లోపు ఏ వ్యక్తి కూడా ప్రచారం చేయవద్దు.
* ఎన్నికల ప్రక్రియ ప్రారం భానికి ఒక గంట ముందు పోలింగ్‌స్టేషన్‌కు పోలింగు ఏజెంట్లు వెళ్లాలి.
* ప్రతి ఓటరు భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధి ష్టంగా పేర్కొన్న ఏదేనీ ఒక డాక్యుమెంట్‌ను పోలింగ్ స్టేషన్‌లో సంబంధిత అధికారికి చూపించాల్సి ఉంటుంది.
* ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవిం గ్‌లైసెన్స్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థ లు, లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గ్రాఫులతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, తపాలా కార్యాలయం జారీచేసిన ఫొటో పాసుపుస్తకాలు, ఆదాయ పన్ను గుర్తింపు కార్డు, జాతీయ జనాభా నమోదు పథకం కింద భారత రిజిస్ట్రార్ జనరల్ జారీచేసిన స్మార్ట్ కార్డులు, ఆరోగ్య బీమా పథకం కార్డు, మాజీ సైనికోద్యోగుల పింఛన్ పుస్తకం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జారీచసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు, ఫొటోతో ఉన్న రేషన్‌కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రా లు, ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఆయుధ లైసెన్స్, వికలాంగ ధ్రువపత్రం, ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలను చూపించవచ్చు.



ఈ అర్హతలు తప్పనిసరి

* సర్పంచ్, లేదా వార్డు సభ్యుడిగా పోటీచేయాలనుకునే వారికి సదరు పంచాయతీ ఓటర్ జాబితాలో పేరు నమోదు అయి ఉండాలి.
* నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉండరాదు.
* షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేనీ కమ్యూనిటీకి చెందిన వారు అయి ఉండాలి.
* షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతుల రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రభుత్వం ప్రకటించిన అయా సామాజిక వర్గాలకు చెందిన వారు అయి ఉండాలి.
* 18 సంవత్సరాల పైబడి వయస్సు కలిగి ఉండి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు అయిన వారు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంబంధిత పంచాయతీ, వార్డులో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

* పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ సభలు, ఊరేగిం పులు నిషేధిస్తారు. * సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను వినియోగించరాదు.
* నిర్దారిత అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లను అతికించడం, గోడలపై రాయడం వంటివి చేస్తే మూడు నెలల కారాగార శిక్ష, లేదా వేయి నుంచి రెండు వేల జరిమానా, లేదా రెండింటికీ శిక్షార్హులు అవుతారు.
* ప్రభుత్వ, ప్రైవేటు స్థలంలో సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల చర్చా వేదికగా లేదా ప్రచారానికి వినియోగించరాదు.
* ఎన్నికల నిమిత్తం నిర్వ హించే బహిరంగసభలో ఎవరైనా ఒక వ్యక్తి సభ జరగకుండా వ్యహరించడం, లేదా క్రమరహిత విధానంలో వ్యవహరించ డం, లేదా ఇతరులను ప్రేరేపించడం చేస్తే ఆరు నెలల కారాగార శిక్ష లేదా రెండువేల జరిమానా విధించవచ్చు.
* ప్రచార సమయంలో ఓటరు జాబితాలో పేరు ఉండి చనిపోయిన వారిని, శాశ్వతంగా ప్రాంతాన్ని విడిచి వెళ్లిన వారిని ఆయా అభ్యర్థుల ఏజెంట్లు, కార్యకర్తలు గుర్తించవచ్చు. అలా తయారు చేసుకున్న జాబితాను సదరు అభర్థి వారు నియామకం చేసుకున్న పోలింగ్ ఏజెంటుకు ఇవ్వవచ్చు. ఎన్నికల రోజున సదరు ఓటరు పేరిట ఎవరైనా ఓటు వేసేందుకు వస్తే సదరు విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకొని పోవచ్చు.
* ఈ పక్రియ బోగస్ ఓటింగ్‌ను నిరోధించడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.

వ్యయం దాటితే వేటే..

* పదివేల జనాభా దాటిన పంచాయతీలో సర్పంచ్ 80 వేల వరకు ఎన్నికలకు ఖర్చు చేయవచ్చు. పదివేలలోపు జనాభా ఉంటే సదరు సర్పంచ్ అభ్యర్థి రూ.40వేల వరకు ఖర్చు చేయవచ్చు.
* వార్డు మెంబర్ అయితే పదివేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలో ఒక్కో వార్డు మెంబర్ రూ.10 వేల వరకు ఖర్చు చేయవచ్చు. పదివేల లోపు జనాభా ఉంటే రూ.6 వేల వరకు ఖర్చు చేయవచ్చు.

అధికారుల నియామకం

* ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది. వీరితో పాటు గత చరిత్రను పరిగణలోకి తీసుకొని ఒక సామాజికవర్గం మరొకరిపై ఆధిపత్యం చలాయించ డం.. రహదార్లు సరిగా లేని గ్రామం, ఓటర్లకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులు లేని గ్రామం, ఎన్నికల సమయంలో హింస జరిగే అవకాశం ఉన్న గ్రామాల్లో సూక్ష్మ పరిశీలకులు( మైక్రో అబ్జర్వర్స్)ను నియమిస్తుంది.
* ప్రతీ 5 నుంచి 10 గ్రామాల కు ఒక జోనల్ అధికారిని జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తా రు. వీరు వారికి కేటాయించిన పంచాయతీల్లోని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను సక్రమంగా జరిగేలా చూడాల్సి ఉంటుంది.
* సమస్యాత్మక పంచాయతీల్లో ప్రత్యేక బందోబస్తు ఉంటుంది. ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు కారణమైనట్లు గుర్తించినా శిక్షార్హులవుతారు.



నామినేషన్ల సమయంలో ప్రత్యేక దృష్టి అవసరం

* రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నాలుగో రోజు నుంచి పదో రోజు మధ్య నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కరదీపికలో పేర్కొంది.
* నామినేషన్ల చివరి రోజే పరిశీలన జరుగుతుంది.
* నామినేషన్ల పరిశీలన మరుసటి రోజే తిరష్కరించబడిన నామినేషన్లపై అప్పీలు చేసుకోవచ్చు. అదే రోజునే అప్పీలును పరిష్కరిస్తారు.
* సర్పంచ్, వార్డు సభ్యుడి పదవికి పోలింగ్ పూర్తయిన రోజునే ఓట్లు లెక్కిస్తారు.
* నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
* సర్పంచ్ కోసం ప్రతిపాదించే వ్యక్తి ఆ గ్రామానికి చెందిన ఓటర్ అయి ఉండా లి. అలాగే వార్డు సభ్యున్ని ప్రతిపాదించే వ్యక్తి ఖచ్చితంగా ఆ వార్డు కు చెందిన ఓటరు అయి ఉండాలి.
* ఒకే పదవి కోసం వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేస్తే వేరువేరు వ్యక్తులు ప్రతిపాదించవచ్చు.
* చట్టంలోని 243(1) విభాగం ప్రకారం ఒక అభ్యర్థి ఒక వార్డుకు మించి పోటీ చేయరాదు. అయితే ఒక వార్డులో ఒకటికి మించి నామి నేషన్లు వేసుకోవచ్చు. అయితే నామినేషన్ల ఉపసంహ రణ సమయంలో ఎంపిక చేసుకున్న ఒక వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల నుంచి వేసిన నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. అలా చేయకపోతే అన్ని వార్డుల్లో వేసిన నామినేషన్లను తిరషరిస్తారు.
* నామినేషన్ పత్రాలను రిటర్నింగు అధికారికి అభ్యర్థిగా నీ లేదా ప్రతిపాదించిన వ్యక్తి గానీ వచ్చి సమర్పించవచ్చు.
* నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం సదరు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరిస్తూ ఇచ్చే రసీదు తీసుకోవాలి.
* పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల నిర్వహణ నియమం 9 (3) ప్రకారం తన నేరపరమైన పూర్వాపరాలు, ఆస్తులు, అప్పులు, విద్యా ర్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షుల ధ్రువీకరణతో స్వీయ డిక్టరేషన్ ఇవ్వాలి.
* అభ్యర్థి ఒక స్థానం కోసం ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినా డిపాజిట్ మాత్రం ఒకటే సరిపోతుంది.
* నామినేషన్లు నిర్దిష్ట సమయంలో అందకపోయి నా, లేదా తిరష్క రించబ డినా, ఉపసంహరించుకున్నా సదరు అభ్యర్థి డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు.
* అభ్యర్థి పసంహరిం చుకుంటున్నట్లు రిటర్నింగు అధికారి ఒకసారి నోటీసు ఇచ్చిన తదుపరి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి దానిని రద్దు చేసుకునే అవకాశం ఉండదు.
* అభ్యర్థి ఎవరైనా ఉపసంహరణ నోటీసు ఇస్తే రిటర్నింగు అధికారి సాధ్యమైనంత త్వరగా పంచాయతీ నోటీసు బోర్డుపై వివరాలను ప్రచురించాల్సి ఉంటుంది.
* సర్పంచ్ పదవికి పోటీచేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండువేల డిపాజిట్, జనరల్ కేటగిరీ కాని వారు వెయ్యి రూపాయల డిపాజిట్ చెల్లించాలి. వార్డు మెంబర్ అయితే జనరల్ కేటగిరీలో ఐదు వందలు, జనరల్ కేటగిరీ కాని వారు రూ.250 డిపాజిట్ చెల్లించాలి.