ప‌కోడీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్న నేష‌న‌ల్ చాంపియ‌న్‌

340

క‌రోనా కొట్టిన దెబ్బ‌కు అంద‌రి జీవిత‌లు త‌ల్ల‌కిందుల‌య్యాయి. ఆశ‌లు నీరుగాయాయి. భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య‌మైంది.

ఏది శాశ్వ‌త‌మో.. ఏది అశాశ్వ‌త‌మో తెలియ‌ని ప‌రిస్థితి. రేప‌టి మీద ఆశ‌లేదు. నేడు ఉంటే చాల‌నుకునే ప‌రిస్థితి నెల‌కొంది.

ఒక నేష‌న‌ల్ చాంపియ‌న్ ఆర్చ‌ర్ ప‌కోడీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తోంది. మమతా టుడూ ఒకప్పుడు ఆర్చరీ నేషనల్ ఛాంపియన్.

కానీ నేడు బతుకుతెరువు కోసం పకోడీలు అమ్ముకోవాల్సిన దుర్భర స్థితిలో బతుకీడుస్తోంది. చెప్పేందుకు జాతీయ ఛాంపియన్.

కానీ కరోనా తరువాత ఆమెను ఆదుకునేవారే కరువయ్యారు. స్పాన్సర్లు లేక ప్రభుత్వ అంద‌క ఒక పూట తిండి కూడా గడవటం గగనంగా మారింది.

దీంతో చేసేది లేక తనకు తెలిసిన పనిని నమ్ముకుని జీవనం సాగిస్తోంది మమతా. కరోనా లాక్ డౌన్ టైమ్‌లో చుక్కలు చూశానని ఆమె చెబుతోంది.

తాను జాతీయ స్థాయి క్రీడాకారిణి అయిన‌ప్ప‌టికీ కనీస మద్దతు, ప్రోత్సాహం లేదని వాపోతోందామె.

మమతా లాంటి స్పోర్ట్స్ ఛాంపియన్లు మనదేశంలో చాలామంది ఉన్నారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఈ గోల్డ్ మెడలిస్ట్ ప్రస్తుతం ఇలా అనామకంగా జీవించాల్సివస్తోంది.

23 ఏళ్ల మమతా తండ్రి భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్‌లో (BCCL) ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. రాంచీలోని ఆర్చెరీ సెంటర్లో మ‌మ‌త ట్రైనింగ్ తీసుకునేది.

కానీ కరోనా కారణంగా అకాడమీ మూసివేయటంతో మమతా ఇంటికి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. అక్క‌డ్నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి.

ఏడుగురు సంతానం ఉన్న కుటుంబంలో మమతా మొదటి అమ్మాయి కావటంతో కుటుంబ భారాన్ని మోయాల్సి వ‌చ్చింది.

పొట్టకూటి కోసం సొంత ఊళ్లోనే సరుకులు అమ్ముతూ, పకోడీలు చేసి ఇంటిల్లిపాదిని పోషిస్తోంది.

ఇక ఈమె చెల్లెళ్లంతా మధ్యలోనే చదువులు ఆపేయాల్సి వచ్చింది. కుటుంబ భారమంతా తన భుజాలపై పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మమతా ఇక్కడే ఉండిపోయింది.

తన తండ్రికి ఇంకా పెన్షన్ రాకపోవటంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.

2010 జూనియర్, 2014 సబ్ జూనియర్ లెవెల్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన మమతా ఇప్పుడు పేదరికానికి తన కెరీర్‌ను బలిపెట్టాల్సి వస్తోంది.

మరోవైపు తనను ఆదుకోవాల్సిన అధికారులు మాత్రం బంధుప్రీతిని చూపుతూ తనలాంటి వారిని కనీసం పట్టించుకోవటం లేదని మమతా ఆరోపిస్తున్నారు.

ఈమె కష్టాలు మీడియాలో చూసిన ధన్బాద్ ఆర్చరీ అసోసియేషన్ మాత్రం కాస్త సాయం చేస్తామని తాజాగా భరోసా ఇచ్చింది.

ఇప్పటి వరకూ వీరు ప్రకటనలకే పరిమితమ‌య్యారు.

2009-2011 మధ్యకాలంలో మమతాకు మెహమ్మద్ షంషాద్ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించారు. అయితే మమతాను ఆయ‌న మోస్ట్ టాలెంటెండ్ ఆర్చర్ అన్నారు.

బతుకుతెరువు కోసం ఆమె ఇలా పకోడీలు అమ్ముకుంటోందని తెలిసి నా గుండె పగిలిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మనదేశంలో కరోనా కారణంగా కెరీర్‌ను పోగొట్టుకుని వీధుల్లో పడినవారి సంఖ్య చాలా ఎక్కువే.

వీళ్లను మ‌ళ్లీ ట్రాక్ మీద పెట్టేందుకు ప్రొఫెషనల్స్, స్పోర్ట్స్ స్టార్స్‌, సామాన్యులకు దాదాపు అసాధ్యంగా మారింది.

ప్రతిభ ఉండి ఇలా పేదరికానికి బలవుతున్న గ్రామీణ క్రీడాకారులు చాలా మందికి ఏ రూపంలోనూ ప్రోత్సాహం లభించటం లేదు.