ఈసారి కూడా ఐపీఎల్‌పై క‌రోనా ప్ర‌భావం?

278

క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎలా నిర్వ‌హించాల‌నే దానిపై బీసీసీఐ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 అన్ని లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) పునరాలోచనలో పడింది.

ముంబైలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాలుగు మైదానాలు (వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, రిలయన్స్‌) ఉన్నాయి.

దీంతో ఒకే నగరంలో బయో సెక్యూర్‌ బబుల్‌ సమస్యలు లేకుండా మ్యాచ్‌లు నిర్వ‌హించొచ్చ‌ని బీసీసీఐ మొదట భావించింది.

కానీ ముంబైతో పాటు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

దీంతో బీసీసీఐ ‘ప్లాన్- బి’ని తెరపైకి తెచ్చింది. ఒకే ఒక న‌గ‌రం కాకుండా.. మ‌రికొన్ని వేదిక‌ల్లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తోంది.

లీగ్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ మేరకు ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాల్ని కూడా తీసుకుంటోంది. అయితే ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లని మాత్రం అహ్మదాబాద్‌లో కొత్తగా పునర్నిర్మించిన నరేంద్ర మోడీ (మొతెరా) స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

‘ముంబై, మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఐపీఎల్‌ 2021 నిర్వహణ కోసం ప్లాన్- బిన కూడా సిద్ధం చేస్తున్నాం.

లీగ్ దశ మ్యాచ్‌ల కోసం వేర్వేరు నగరాల పేర్లను పరిశీలిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.

ప్లే ఆఫ్, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ నగరంలోనే జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

మొత్తానికి కొత్త షెడ్యూల్‌పై కూడా బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది.

ఇదిలావుంటే ప్లాన్-బిలోనూ ఇప్పుడు ఓ సమస్య తలెత్తనుంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

దీంతో కోల్‌కతా, చెన్నైల‌లో మ్యాచ్‌లు, పోలింగ్ తేదీలు క్లాష్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు బీసీసీఐకి తలనొప్పిగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు, తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నిలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తేదీలు క్లాష్ కాకుండా చూడాలి.

గ‌త ఏడాది క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో భారత్‌లో ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. గతేడాది సెప్టెంబ‌ర్‌లో 13వ ఎడిష‌న్ ఐపీఎల్‌ను దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించారు.

అక్కడి మూడు నగరాల్లో (దుబాయ్, అబుదాబి, షార్జా) బయోబుల్ వాతావరణం సృష్టించి టోర్నీ నిర్వహించారు.

అయితే ఈసారి ఇంకా కొంత స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో భారత్‌లో ఎక్క‌డెక్కడ టోర్నీలు నిర్వ‌హించాల‌న్న కోణంలో బీసీసీఐ ఆలోచనలు చేస్తోంది.