
టెస్టు మ్యాచ్‌లో కొందరు ఒకేసారి ఐదు రోజులకు టికెట్ కొంటారు. కొంత మంది తమకు వీలైన రోజుకు కొంటారు.
మొన్న మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగిసింది. మరి మిగిలిన మూడు రోజులకు టికెట్లు కొన్నవారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సమస్యగా మారింది.
‘మా టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తారా?’ అని కొందరు ఆన్‌లైన్‌లో క్రికెట్ నిర్వాహకులను అడుతున్నారు. రిఫండ్ పాలసీ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
బుక్‌మై షో ద్వారా టికెట్లు కొన్నవాళ్లు ఆ ట్విట్టర్ అకౌంట్‌కు తమ ఫిర్యాదులు పంపుతున్నారు. డబ్బులు వాపస్ ఇవ్వండి లేదా మరో మ్యాచ్‌కు టికెట్ అన్న ఇవ్వండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
స్పిన్నర్ల పుణ్యమా అని ఆ మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్లతో గెలిచింది.
ఈ సిరీస్‌లో కోహ్లీ సేన ఆధిక్యం సాధించిందన్న ఆనందం ఒకవైపు ఉన్నప్పటికీ మ్యాచ్ మరీ రెండ్రోజుల్లోనే ముగియడం పట్ల మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫాన్స్ కూడా అసహనంతో ఉన్నారు. మ్యాచ్ జరగాల్సిన 3,4, 5వ తేదీలకు సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే మ్యాచ్ మాత్రం రెండు రోజుల్లోనే ముగిసింది.
ఈ ఓటమితో ఇంగ్లిష్ జట్టు 1-2తో వెనకబడింది. మార్చి 4 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
నరేంద్ర మోదీ స్టేడియంలోనే చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు గుజరాత్‌లోనే ఉన్నారు.
కరోనా నేపథ్యంలో టెస్ట్ సిరీస్ బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం అయినప్పటినుంచి నేటి వరకు మొత్తం 2412 టెస్టులు జరిగాయి.
అందులో 22 మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ అత్యధికంగా 13 సార్లు రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల్లో భాగస్వామిగా నిలిచింది.
అందులో 9సార్లు విజయం సాధించగా.. 4 సార్లు ఓటమి చవిచూసింది. ఇక ఆధునిక క్రికెట్‌లో 2000 తర్వాత మొత్తం ఏడు టెస్టులు రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి.
ఇంగ్లండ్ రెండుసార్లు తలపడగా ఒకదాంట్లో విజయం సాధించి, మరొకదాంట్లో ఓటమిపాలైంది. ఈ ఏడు టెస్టుల్లో జింబాబ్వే అత్యధికంగా మూడు సార్లు పాలుపంచుకుంది.
భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాయి.