స్నిఫర్ డాగ్‌కి ఘనంగా వీడ్కోలు

227

విశ్వాసానికి మారు పేరు శునకం. కాసింత తిండి పెడితే ఎంతో విశ్వాసాన్ని క‌న‌బ‌రుస్తాయి కుక్క‌లు.

ఇంటికి కాప‌లా ఉంటాయి. అందుకే న‌మ్మిన వాళ్లే మోసం చేస్తే విశ్వాసం లేని కుక్క అని తిడుతుంటారు.

పోలీసు శాఖలో స్నిఫర్ డాగ్‌లు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేయడంతోపాటు… బాంబులను పసిగట్టడం లాంటి చాలా కీలకమైన పనులు

ఈ శున‌కాలు నిర్వహిస్తాయి. అయితే ఓ శున‌కం పోలీసు శాఖలో దాదాపు 11 సంవత్సరాల పాటు ఉత్తమ సేవలు అందించింది. దానికి ఘనంగా వీడ్కోలు పలికారు.

11 సంవ‌త్స‌రాలు నిర్విరామంగా సేవ‌లందించిన ఆ స్నిఫ‌ర్ డాగ్‌కు మ‌హారాష్ర్ట నాసిక్ పోలీసులు ఫిబ్ర‌వ‌రి 24న‌ ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

పోలీసు వాహ‌నం బానెట్‌పై బెలూన్స్‌, గులాబీ పూల‌తో డెక‌రేట్ చేశారు. బెలూన్స్ మ‌ధ్య స్నిఫ‌ర్ డాగ్‌ను కూర్చోబెట్టి.. పూల‌మాల‌తో స‌త్క‌రించి వీడ్కోలు చెప్పారు.

ఈ శున‌కం విధి నిర్వ‌హ‌ణ‌లో ఎన్నో బాంబుల‌ను గుర్తించి శెభాష్ అనిపించుకుంది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన విధుల్లో చురుకుగా పాల్గొని, పోలీసుల‌కు ఎంతో మేలు చేసింద‌ని పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.