హైదరాబాద్‌లో వింత శిశువు

766

హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ వింత శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. శ‌రీరంలోని పై భాగం మ‌నిషి ఆకారం కింది భాగం చేప ఆకారం.

హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ఈ వింత దృశ్యం చోటు చేసుకుంది. ఈ శిశువు 2 గంట‌లు మాత్ర‌మే జీవించి ఉంది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి నెలలు నిండడంతో ప్రసవం కోసం బుధవారం సాయంత్రం పేట్ల బురుజు ఆస్పత్రికి వచ్చింది.

అయితే ఆమె ప్రసవించిన బిడ్డను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ బిడ్డ అచ్చం చేపలా కనిపించింది.

శిశువు నడుము పైభాగం వరకు బాగానే ఉంది. కానీ కింది భాగం చేప ఆకారంలో ఉంది. జననేంద్రియాలు, కాళ్లు సరిగా అభివృద్ధి చెందలేదు.

అసలు ఈ బిడ్డ ఇలా ఎందుకు పుట్టిందని తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

క్రోమోజోములతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల ప్ర‌భావ‌మేమైనా ఉందేమో తెలుసుకునేందుకు మాయను పరీక్షల కోసం పంపించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

”తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకు మొదటి 8-12 వారాలు ఎంతో కీలకం. ఆ సమయంలోనే అవయవాలు అభివృద్ధి చెందుతాయి.

సిగరెట్, మద్యంతో పాటు ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారం వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారు.

మేనరికం వ‌ల్ల కూడా జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. ఒక్కోసారి స్కానింగ్‌లో కూడా బయటపడకపోవచ్చు” అని గాంధీ ఆస్పత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి చెప్పారు.

తమ బిడ్డ వింతగా జన్మించడం, పుట్టిన కాసేపటికే మరణించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.