మహిళలు మానసిక బలహీనులు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఏదైనా చిన్న ఆశ చూపితే వెంటనే ఆ ఉచ్చులో పడిపోతారు.
అందుకే సైబర్ నేరగాళ్లకు మహిళలే టార్గెట్. టెక్నాలజీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దాంతోపాటు దుష్ప్రభావాలు కూడా పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్, స్టార్ట్ ఫోన్‌ల వాడకం పెరిగిన తర్వాత మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి.
సోషల్ నెట్‌వర్క్‌లో మహిళల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి.
తద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
వేధింపులకు పాల్పడుతున్నారు. సమాజంలో పరువు పోతుందన్న ఆలోచనతో సైబర్ నేరగాళ్లపై మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.
అంతేకాదు ఒకవేళ ఫిర్యాదే చేయాలనుకున్నా ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా చాలా మందికి తెలీదు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం…
ఓపెన్ వైఫైకి దూరంగా ఉండండి:
ఉచిత వైఫై, ఇతర ఓపెన్ నెట్‌వర్క్‌ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు లాగ్‌ఇన్ కాకూడదు.
వీటి ద్వారా నేరగాళ్లు వ్యక్తుల అకౌంట్, పాస్‌వర్డ్స్‌ను హ్యకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పబ్లిక్ ప్లేస్‌లలో ఉండే ఓపెన్ నెట్‌వర్క్స్ వాడుతూ ఇ-కామర్స్ సైట్లలో షాపింగ్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయకూడదు.
ఓపెన్ నెట్‌వర్క్స్ ద్వారా వ్యక్తుల బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు దొంగిలించే అవకాశం ఉంది.
అందువల్ల ఎలాంటి అవసరాలకైనా సెక్యూరిటీ కోడ్, సేఫ్టీ ఎక్కువగా ఉండే వైఫై నెట్‌వర్క్‌లనే ఉపయోగించాలి.
ఫోటోలు షేర్ చేయవద్దు:
సోషల్ మీడియా నుంచి మహిళల ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేస్తున్నారు.
ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖాన్ని మరో వ్యక్తి శరీరానికి జత చేసి అసభ్యకరంగా మార్పులు చేస్తున్నారు.
వీటిని పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. కొంతమంది ఈ ఫోటోలను కొన్ని డార్క్ వెబ్‌సైట్లకు అమ్ముకుంటున్నారు.
అందువల్ల సోషల్ నెట్‌వర్క్ సైట్లలో ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వండి. వ్యక్తిగత ఫోటోలను ఎవరితోనూ పంచుకోకండి.
కొంతమంది మొబైల్ ఫోన్‌లో తీసిన ఫోటోలను గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ అకౌంట్లకు బ్యాకప్ చేసుకుంటారు.
వీటికి బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండొచ్చు.
యాంటీ డేటా రికవరీని వాడండి:
ప్రస్తుతం వాడుతున్న ఫోన్లు, డివైజ్‌లను ఇతరులకు అమ్మాలనుకున్నప్పుడు యాంటీ డేటా రికవరీ సొల్యూషన్‌ను ఉపయోగించాలి.
దీనివల్ల డివైజ్‌లలో ఇంతకు ముందు స్టోర్ చేసి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయలేరు.
కొన్ని రకాల సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి డేటా రీ స్టోర్ చేసి, దాన్ని బ్లాక్ వెబ్‌సైట్‌లో అమ్ముకుంటున్న కేసులు ఇంతకు ముందు వెలుగు చూశాయి.
అందువల్ల డేటా దుర్వినియోగం కాకుండా యాంటీ డేటా రికవరీ సొల్యూషన్‌ని ఉపయోగించాలి.
కట్టుదిట్టమైన భద్రత ఉండాలి:
జీ మెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేయడానికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
దీనివల్ల హ్యాకర్లు రెండుసార్లు అకౌంట్లను అక్రమంగా యాక్సెస్ చేయడం కష్టంగా మారుతుంది. యూజర్లకు అదనపు భద్రత లభిస్తుంది.
డివైజ్‌లను లాక్ చేయండి:
వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు తెలుసుకోలేని విధంగా డివైజ్‌లను లాక్ చేసి ఉంచాలి.
ఇప్పుడు తయారు చేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గానే సెక్యూరిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
దీంతో పాటు ఆన్‌లైన్‌లో డివైజ్ సెక్యూరిటీ కోసం ఎన్నో ఉచిత యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో ఏదో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడాలి. ఇవి డేటా భద్రతకు భరోసా ఇస్తాయి.
వివిధ రకాల పాస్‌వర్డ్ ఉండాలి:
యూజర్లు పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఇతరులు సులభంగా పాస్‌వర్డ్స్‌ను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది.
సోషల్ మీడియా సైట్లలో అయితే వాటి పాస్‌వర్డ్ పాలసీకి అనుగుణంగా బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి.
వివిధ రకాల ఆన్‌లైన్ అకౌంట్ల కోసం విభిన్న పాస్‌వర్డ్స్ పెట్టుకోవాలి. అన్నింటికీ ఒకటే పాస్‌వర్డ్‌ను పెట్టకూడదు.
మరికొన్ని జాగ్రత్తలు:
యువతులు, మహిళలు సోషల్ మీడియా అకౌంట్ సెట్టింగ్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చుకోవాలి.
అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలి.
యూజర్లు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు.
సమాచారాన్ని పరిమితంగానే షేర్ చేయాలి. అసభ్యకరంగా మెసేజ్‌లు చేసేవారు, సైబర్ వేధింపులకు పాల్పడేవారి అకౌంట్లను బ్లాక్ చేయాలి.
అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి.