నాకు పెళ్లి చెయ్యండి ప్లీజ్‌

748

అత‌ని వ‌య‌సు 26 ఏళ్లు. పెళ్లి వ‌య‌సు వ‌చ్చింది. సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ ఎన్ని సంబంధాలు చూసిన సెట్ కావడం లేదు.

అమ్మాయి తరపు వాళ్లు అతడిని చూసేందుకు వ‌స్తున్నారు. వెళుతున్నారు.

ఫోన్ చేసి చెబుతాం అంటూ వెళ్లే త‌ప్ప వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు.

దీంతో ఆ కుర్రాడికి పెళ్లి చూపుల పట్ల విసుగొచ్చింది. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా సీఎంకు లేఖ కూడా రాశాడు.

తాజాగా తనకు పెళ్లి చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

పబ్లిక్ సర్వీస్‌లో భాగంగా తనకు ఈ ఒక్కసాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ అంటూ కోరుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో ఓ కుర్రాడు పెళ్లి కోసం ప‌డుతున్నా ఆరాటం ఇది.

అత‌ను మ‌రుగుజ్జు

అజీమ్ అనే కుర్రాడికి 26 ఏళ్ల వయసు.

కాస్మోటిక్స్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. డబ్బును కూడా బాగానే కూడబెట్టుకన్నాడు.

సొంత ఇల్లు కూడా ఉంది. బంధువులు, బలగం కూడా బాగానే ఉన్నారు.

అతడికి 21 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు మొదలు పెట్టారు.

కానీ ఐదేళ్లయినా అతడికి ఎంతకూ పెళ్లి కుదరడం లేదు. కారణం అతడు రెండంటే రెండే అడుగులు ఉండటమే.

అవును అతడు మరుగుజ్జు. మీరు కమల్ హసన్ హీరోగా నటించిన విచిత్ర సోదరులు సినిమాను చూసే ఉంటారు.

అందులోని ఓ సన్నివేశంలో ‘ఒక వేళ మీ అమ్మాయి నా కొడుకు లాంటి వాడిని ప్రేమిస్తే మీరు అభ్యంతరం పెట్టాలి.

మీ అమ్మాయి ప్రేమించిన కుర్రాడు చక్కగా ఒడ్డూ పొడుగు బాగున్నాడు. అమ్మాయికి సరైన ఈడుజోడు.

మీ అమ్మాయి ప్రేమ పెళ్లికి ఒప్పుకోండి‘ అంటూ కమల్ హసన్‌కు తల్లిగా నటించిన ఆమె అంటుంది.

దాంతో మరుగుజ్జు కమల్ హాసన్ తీవ్రంగా మనోవేద‌నకు గురవుతాడు.

జీవితాన్ని పంచుకునే వ్య‌క్తి దొర‌క‌దా

అచ్చం అదే మనోవేధన పెళ్లిచూపులు జరిగిన ప్రతీసారి అజీమ్ ఎదుర్కొంటున్నాడు.

చిన్నప్పుడు స్నేహితుల కామెంట్స్ భరించలేక ఐదో తరగతి వరకే చ‌దువుకున్నాడు.

ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో పని చేసుకుంటూ కాస్మొటిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి విషయంలో అతడు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు.

‘నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా. రాత్రిళ్లు నాకు అసలు నిద్రపట్టదు. నా జీవితాన్ని పంచుకునే వ్యక్తే నాకు దొరకదా అని భయమేస్తుంటుంది.

నీకు పెళ్లి అవసరమా అంటూ ఈటల్లాంటి మాటలతో లేఖలు రాస్తుంటారు.

నాకు ఇక పెళ్లి కాదని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ఆపేశారు‘ అని అజీమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌

2019వ సంవత్సరంలో తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను అజీమ్ లక్నోలో కలిశాడు.

తనకు పెళ్లి విషయంలో సాయం చేయాల్సిందిగా కోరాడు. ఎనిమిది నెలల క్రితం కైరానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు పెళ్లి జరిపించాల్సిందిగా కోరాడు.

జీవిత భాగస్వామిని కనుక్కునేందుకు సాయం చేయాల్సిందిగా ఓ లేఖను కూడా వారికి సమర్పించాడు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కు ఈ విషయమై పోలీసులు ఓ లేఖను కూడా అందజేశారు.

అయితే పోలీసులు, సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా మొన్న బుధవారం మరోసారి పోలీసుల వద్దకు వెళ్లాడు.

దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తాము ఈ విషయంలో ఏం చేయగలమో అది చేస్తామని హామీ ఇచ్చారు.