న్యూస్ రీడ‌ర్‌గా ట్రాన్స్ జెండర్

545

ట్రాన్స్‌జెండ‌ర్స్‌ను ఈ స‌మాజం వివ‌క్ష‌తో చూస్తోంది. ఉన్న‌త‌మైన విద్య చ‌దువుకున్న‌ప్ప‌టికీ వీరికి ఈ స‌మాజంలో త‌గిన గౌర‌వం ద‌క్క‌డం లేదు.

స‌మాజం వీరిని వెలివేస్తోంది. వాళ్లంటే చిన్న‌చూపు. దీంతో చాలా మంది ట్రాన్స్‌జెండ‌ర్లు తీవ్ర‌మైన పేద‌రికంలో జీవిస్తున్నారు.

అయితే బంగ్లాదేశ్‌లోని ఓ ట్రాన్స్‌జెండ‌ర్ వీరంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. త‌ష్నువా అన‌న్ అనే ట్రాన్స్‌జెండ‌ర్ బంగ్లాదేశ్‌లో న్యూస్ రీడ‌ర్‌గా అపాయింట్ అయ్యింది.

దీంతో ఆ దేశంలో తొలి న్యూస్ రీడ‌ర్‌గా ఆ ట్రాన్స్‌జెండ‌ర్ రికార్డుల్లోకెక్కింది.

ఇకనైనా తమ కమ్యూనిటీకి చెందిన వారంతా వివక్ష నుంచి బయటపడతారని ఆశిస్తున్న‌ట్లు తెలిపింది.

ఇక‌నైనా సమాజం తమను వారిలో ఒకరిగా అంగీకరిస్తుందని భావిస్తున్నానని పేర్కొంది. త‌ష్నువా అన‌న్ ఓ సామాజిక కార్యకర్త కూడా.

గతంలో ట్రాన్స్ జెండర్లు, వలసవాదులకు మద్దతుగా ఎన్జీవోతో కలిసి ఆమె పనిచేసింది.

అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌లో తొలిసారి డెయిలీ న్యూస్ బులిటెన్‌ను చదివి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఒక ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ కావడాన్ని ప్రజలంతా స్వాగితిస్తారని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది.

ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీపై ప్రజల్లో ఉన్న ఆలోచనల్లో మార్పును తీసుకొస్తుందని త‌ష్నువా చెప్పింది.

అందరిలాగా తమకు కూడా సమాజంలో గౌరవభావం దక్కుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ అంచనాల ప్రకారం 11,500 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. చాలామంది ట్రాన్స్ జెండర్లు చిన్నతనంలోనే కుటుంబాల నుంచి వెలివేతకు గురైనవారే.

సరైన విద్య లేకపోవడంతో ఉద్యోగాలు రాక తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారని సామాజిక కార్యకర్తులు వాపోతున్నారు.

ట్రాన్స్ జెండర్లు కూడా మనుషులేనని, వారికి కూడా విద్య నేర్చుకునే హక్కు ఉందని అంటున్నారు.

సమాజంలో అందరితోపాటు తాము గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటామ‌ని.. ఆ రోజులు త్వరలోనే వస్తాయని కోరుకుంటున్నాన‌ని అనన్ తెలిపింది.