గోమాతకు శ్రీమంతం

748

భార‌త్‌లో గోవులను దైవంతో సమానంగా చూస్తారు. అందుకే వాటిని గోమాత అని పిలుస్తారు. గోమాత విలువను మెదక్ జిల్లా ఆడపడుచులు మరింత పెంచారు.

ఏకంగా శ్రీమంతం జరిపి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ఇంటి ఆడపడుచులకు శ్రీమంతం ఎలా చేస్తారో గోమాతకు కూడా అలాగే చేయడం విశేషం.

చీర కట్టి పండ్లు పలహారాలు పెట్టి పూలదండ వేసి సద్దులు ముట్టించి గోమాతకు శ్రీమంతం చేశారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.

పట్టణానికి చెందిన ఆకుల సుభాష్ తన ఇంట్లో పెంచుకుంటున్న గోవును ఆడపడుచుగా భావించి శ్రీమంతం చేయాల‌ని నిర్ణయించారు.

ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్వర్యంలో గోమాతను మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.

పురోహితుల అధ్వర్యంలో శాస్త్రీయంగా శ్రీమంతం నిర్వహించారు.

ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి మంజుల, కోశాధికారి అనిత, ఉపాధ్యక్షులు చందన, సంయుక్త కార్యదర్శి నాగమణి తదితరులు హాజరై గోమాతకు చీరలతో సారె పిండి వంటలు సమర్పించారు.

శ్రీమంతానికి వచ్చిన వారికి అతిథి మర్యాదగా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు.