అమెరికా వెళ్లాలనుకునే వారికి నిజంగా ఇది శుభవార్త. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ గద్దెనెక్కడంతో వలసదారుల్లో ఉత్సాహం నెలకొంది.
అమెరికాలో ఉద్యోగాలు చేయగోరేవారికి ఊరట కల్పిస్తూ బైడెన్ సర్కారు కీలక అడుగులు వేసింది.
కొత్త హెచ్ 1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ప్రారంభమైంది.
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రారంభమైన హెచ్ 1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.
ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలో వీసాలు జారీ చేయనున్నారు. ఇలా వీసాకు ఎంపికైన వారికి యూఎస్‌సీఐఎస్ మార్చి 31లోపు సమాచారం చేరవేస్తుంది.
వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది.
అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్ (అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది.
ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది.
అయితే ప్రతి ఏడాది యూఎస్ ఇచ్చే 85వేల కొత్త హెచ్-1బీ వీసాలలో సుమారు 70 శాతం వీసాలు (దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం.
భారత్ తర్వాత అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందేది డ్రాగన్ కంట్రీ చైనానే.
ఈ వీసా ద్వారా అగ్రరాజ్యంలో తాత్కాలికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఊరట లభించినట్లయింది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్:
- మొదట ప్రతి దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్ ఖాతా క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు (రూ.729) చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం.
- ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు.