ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎలా?

460

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు శుక్ర‌వారంతో ప్ర‌చారం ముగిసింది. ఈ నెల 14న (ఆదివారం) ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న‌, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రావు మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఎలా ఓటు వేయాలో ఓసారి తెలుసుకుందాం.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 10 లక్షల మందికిపైగా గ్రాడ్యుయేట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్యాట్రన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఎంతమందికైనా ఓటేసే అవకాశం ఉంటుంది.

కానీ ఓటింగ్‌లో ప్రథమ ప్రాధాన్యత తప్పనిసరిగా గుర్తించాలి. బ్యాలెట్‌ పేపర్‌లో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి కచ్చితంగా ఒకటో నంబరు వేయాలి.

ప్రథమ ప్రాధాన్యత లేకుండా రెండో నెంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే ఇద్దరు అభ్యర్థులకు ఒకటో నంబరు వేసినా ఆ ఓటు చెల్లదు.

అంటే ఓటు లెక్కింపు జ‌ర‌గాలంటే ఒకటో నంబర్‌ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది.

పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే బ్యాలెటు పత్రంపై సిబ్బంది ఇచ్చే వంకాయ రంగు స్కెచ్‌ పెన్‌తోనే నెంబర్లు వేయాలి.

ప్రాధాన్యత‌ క్రమంలో వరుస తప్పకుండా 1, 2, 3.. అని రాయాలి. అంకెల పక్కన ఇతర అక్షరాలు, సంతకాలు, పేర్లు, ఏ ఇతర గుర్తులు రాయకూడదు.

అలా చేస్తే ఆ ఓటు చెల్లదు. ఒకవేళ ఒకరికే ఓటు వేయదలిస్తే పేరు ఎదురుగా 1 అని రాసి బ్యాలెట్‌ పేపర్‌ను బాక్స్‌లో వేయవచ్చు.

బ్యాలెట్‌ పేపర్‌పై 1 కాకుండా మిగిలిన అంకెలు ఎన్ని ఉన్నా ఆ ఓటు చెల్ల‌దు. అంకెల క్రమం వరుసగా ఉన్నంత వరకే ఓట్లు చెల్లుతాయి.

ఉదాహరణకు మూడో ప్రాధాన్యం తర్వాత ఐదో ప్రాధాన్యం ఇస్తే ముగ్గురి ఓట్లే చెల్లుతాయి. 4వ సంఖ్య రాయని కారణంగా తర్వాతి ఓట్లు చెల్లకుండా పోతాయి.

మరోవైపు గ్రాడ్యుయేట్లంతా ఓటేస్తారా లేదా అనే టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అంద‌రికీ ఓటు వేసే హ‌క్కు ఉంటుంది.

కానీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు ఉండదు.

ప్రత్యేకించి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న వారిలో అందరూ ఓటేస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఒకవేళ ఓటేసినా సరిగ్గా వేస్తారని న‌మ్మ‌కంగా చెప్ప‌లేం.

గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతీసారి పోలింగ్ శాతం తక్కువగా ఉండటం చెల్లని ఓట్లు ఎక్కువగా ఉంటుండటంతో ఈసారి కూడా అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది.

పేరుకే గ్రాడ్యుయేట్లయినా ఓట్లేసి ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలనే ఆసక్తి వారిలో కనిపించడం లేదు.

ఈసారైనా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు వస్తారా? వచ్చినా తప్పులు లేకుండా ఓటేసి చెల్లుబాటయ్యేలా చూసుకుంటారా? అన్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.