పెళ్లి వేడుకలో పోలీసులు ప్రత్యక్ష్యం

241

సంద‌ర్భం ఏదైనా పోలీసులు వ‌చ్చారంటే అంద‌రికీ కాస్త ఖంగారుగానే ఉంటుంది. అందులోనే పెళ్లికి వ‌చ్చారంటే టెన్ష‌న్ పుడుతుంది.

అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే… వైభవంగా ఓ పెళ్లి జరుగుతోంది. ఇంతలో అక్కడకు కొందరు పోలీసులు వచ్చారు. బంధువుల్లో టెన్షన్ మొద‌లైంది.

పోలీసులు వచ్చారా? అని తీరా తీస్తే వాళ్లను పెళ్లికూతురే పిలిచిందట‌. తన పెళ్లిలో భాగంగా జరుగుతున్న ఓ కార్యక్రమం ఆమెకు ఇష్టం లేదట.

అందుకే పోలీసులకు ఫోన్ చేసి మరీ పిలిచింద‌ని తెలిసింది. పోలీసులు వచ్చి ఆ పెళ్లిలో తనకు ఇష్టం లేని ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించారు.

ఈ ఘ‌ట‌న‌ ఉత్తరాఖండ్‌లో జ‌రిగింది. ఉత్త‌రాఖండ్ పోలీసులు ఓ కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. వాస్తవానికి ఇలాంటి స్కీమ్‌లను ప్రభుత్వాలే ప్రవేశపెడుతుంటాయి.

కానీ ఉత్తరాఖండ్‌లో పోలీసులే ముందుకొచ్చి ఆ కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. అమ్మాయిలకందరికీ ఆ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మద్యం నిషేధంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలోని దేవ్ ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో ఓ కొత్త ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు.

పెళ్లి వేడుకల్లో ధూంధాం అనిపించేలా డీజేలు, బాజా భజంత్రీలతోపాటు ఫుల్లుగా మద్యం పార్టీలు కూడా జరుగుతుంటాయన్నది తెలిసిందే.

తమ పెళ్లిలో మద్యం ఏరులై పారకూడదని అందరు అమ్మాయిలు అనుకుంటుంటారు. కానీ మద్యం పార్టీ జరుగుతోంటే ఏం చేయలేక మిన్నకుండి పోతారు.

అలాంటి అమ్మాయిలు ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అలా ఫిర్యాదు చేస్తే తాము అక్కడకు వచ్చి మద్యం పార్టీలు జరగకుండా చూస్తామని దేవ్ ప్రయాగ్ పోలీసులు చెబుతున్నారు.

అంతే కాదండోయ్ అలా ఫిర్యాదు చేసి పెళ్లిలో మద్యం నిషేదానికి పూనుకున్న వధువులకు 10,001 రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తారట.

దీనికి ‘సోదరి కన్యాదాన్ స్కీమ్’ అని పేరు కూడా పెట్టారు. ఈ విషయం తెలిసి కుర్రాళ్లంతా షాకవుతోంటే, యువతులు మాత్రం ఎగిరిగంతేస్తున్నారు.

మరి భవిష్యత్తులో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లిళ్లలో ఎన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో చూడాలి.