
ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కాలా. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని పా.రంజిత్ తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మార్చి 1న తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించినప్పటికి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో ఈ రోజు విడుదల కానున్నట్టు ప్రకటించారు. కాని తమిళ భాషలో కాలా టీజర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. మాఫియా డాన్‌గా కరికాలన్ పాత్రలో రజనీకాంత్ అదరగొట్టాడు. క్యారే సెట్టింగా, దిల్ ఇరుంత మోతమ వంగ లే అనే డైలాగ్‌కి తమిళ ప్రేక్షకులు ఎగిరి గంతులు వేస్తున్నారు. ప్రస్తుతం తమిళ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు భాషకి సంబంధించి ఈ రోజు ఉదయం 10గం.లకు టీజర్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. వండర్ బార్ ఫిలింస్ బానర్‌పై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా ఏప్రిల్ 27న థియేటర్స్‌లోకి రానుంది. రజనీకాంత్ 164వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్రఖని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ గా అదరగొట్టాడని టీజర్‌ని బట్టి చెబుతున్నారు.