ఒక వైపున హీరోగాను .. మరో వైపున ముఖ్యమైన పాత్రలతోను ప్రేక్షకులను శ్రీకాంత్ పలకరిస్తూనే వున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో సహజంగా ఒదిగిపోతాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీకాంత్ తాజా చిత్రంగా ‘ఆపరేషన్ 2019’ సినిమా రూపొందుతోంది. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ట్యాగ్ లైన్. ‘ఆపరేషన్ దుర్యోధన’ మాదిరిగానే ఈ సినిమా కూడా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
రాజకీయ వ్యూహాలకి సంబంధించిన సన్నివేశాలు .. తాడో పేడో తేల్చుకునే సన్నివేశాల పైనే ట్రైలర్ ను కట్ చేశారు. తన కాలు నుంచి జారిన చెప్పును ఓ పోలీస్ ఆఫీసర్ తొడగబోగా ఆయన చెంపను శ్రీకాంత్ పగలగొట్టడం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. “గాంధీ కడుపున గాంధీ పుట్టడు .. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు .. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు .. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే” అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.