
సినీ తారలు, క్రీడాకారులు రాజకీయ రంగ ప్రవేశం మామూలే. తాజాగా భారత క్రికెటర్ మనోజ్ తివారి రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నాడు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఇవాళ హుగ్లీలోని ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జి సమక్షంలో టీఎంసీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చిన్సురాహ్ జిల్లాలోని హుగ్లీలో జరిగే ప్రచారసభకు మమతా బెనర్జి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా క్రికెటర్ మనోజ్ తివారీ టీఎంసీ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా 35 ఏండ్ల మనోజ్ తివారీ ఇప్పటివరకు పశ్చిమబెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బెంగాల్‌లో చోటా దాదాగా పేరున్న మనోజ్ భారత్ తరఫున కూడా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జియాంట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాజకీయాల్లోకి క్రికెటర్లు రావడం కొత్తేమీ కాదు.
అజారుద్దిన్, మహ్మద్ కైఫ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లు అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
అయితే భారత జట్టులో కీలక ఆటగాళ్లు, అనేక విజయాలను అందించిన క్రికెటర్ల చూపు ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లినట్లు కనిపిస్తోంది.