రేగట్టా పోటీలలో చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణా కుర్రోడు

412
durga-prasad-creating-history-in-regatta

రెగట్టా పోటీల్లో అద్భుతాలు సాధిస్తూ మేటి ‘సైలర్’గా గుర్తింపు తెచ్చుకున్న పదిహేనేళ్ల ఆ కుర్రాడు అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తానని ధీమాగా చెబుతున్నాడు.. భవిష్యత్‌లో నేవీ అధికారిగా దేశానికి సేవలందిస్తానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు..




 

హైదరాబాద్‌లోని రసూల్‌పురాలో పేద కుటుంబానికి చెందిన ఎర్రా దుర్గాప్రసాద్ ‘ఆర్మీ బోయిస్ స్పోర్ట్స్ కంపెనీ’కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తన కుమారుడు ‘జలక్రీడ’ల్లో దేశానికి గర్వకారణంగా నిలుస్తాడని, ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ క్రీడల్లో కచ్చితంగా పతకాలు సాధిస్తాడని దుర్గాప్రసాద్ తండ్రి ఎర్రా లింగం చెబుతున్నారు. ఆర్థికపరంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కఠోర దీక్షతో శ్రమిస్తున్న ఈ కుర్రాడు రెగట్టా అండర్-16 విభాగంలో నెంబర్ వన్‌గా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి వనె్న తెచ్చాడు. సరైన సమయంలో తన ప్రతిభకు సాన పెడుతున్న దుర్గాప్రసాద్ మన దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెడతాడని ‘యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ ప్రతినిధులు కూడా గర్వంగా చెబుతున్నారు. సబ్- జూనియర్ కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలుస్తానని తాను మొదట అనుకోలేదని, ఇపుడు ఏ అంతర్జాతీయ పోటీలోనైనా పాల్గొని ‘ఉత్తమ భారతీయ సైలర్’గా నిలుస్తానని దుర్గాప్రసాద్ అచంచల విశ్వాసంతో అంటున్నాడు.

ఇటీవల జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ రెగట్టా’ అండర్-16 విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఈ హైదరాబాదీ కుర్రాడు మున్ముందు మరిన్ని అద్భుతాలను సాధిస్తానంటున్నాడు. అంతర్జాతీయ పోటీలకు వెళితే ఏదో ఒక పతకాన్ని సాధించగలనన్న ఆత్మవిశ్వాసం తనలో పెరిగిందని చెబుతున్నాడు. చంద్రానగర్ కాలనీలోని ఉద్భవ్ స్కూల్‌లో చదివిన దుర్గాప్రసాద్ ప్రతిభను ‘యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ ప్రతినిధులు గుర్తించి కృష్ణపట్నంలో జరిగిన రెగట్టా పోటీల్లో పాల్గొనేందుకు తర్ఫీదు ఇచ్చారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో శిక్షణ పొందడంతో తనకు రెగట్టాలో ఎన్నో మెళకువలు తెలిశాయని దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. తన నైపుణ్యాన్ని గుర్తించి, గత నాలుగేళ్లుగా ‘యాచ్ క్లబ్’ ఎంతగానో ప్రోత్సహిస్తోందని అంటున్నాడు. నావికాదళానికి చెందిన కోచ్‌లు ఇచ్చిన తర్ఫీదు వల్లనే తాను జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని సాధించానని వినమ్రంగా చెబుతున్నాడు.

Durga prasad creating history in regatta

గత ఆగస్టులో నావికాదళంలో చేరిన దుర్గాప్రసాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి రెగట్టా పోటీలకు హాజరయ్యాడు. తెలంగాణ నుంచి మొత్తం 24 మంది ఈ పోటీలకు వెళ్లినా ఈ కుర్రాడు మాత్రమే పతకాన్ని సాధించాడు. ‘ఇండియా ఇంటర్నేషనల్ రెగట్టా’ టోర్నమెంటుకు ఐర్లాండ్, స్వీడన్, హాంగ్‌కాంగ్, యుఏఈ, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక తదితర దేశాల నుంచి సుమారు 250 మంది సైలర్లు హాజరయ్యారు. పిన్న వయసులోనే పతకాన్ని సాధించిన దుర్గాప్రసద్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని ‘యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ ప్రతినిధులు చెబుతున్నారు. ఆసియన్ గేమ్స్‌లో లేజర్ బోట్లతో పోటీలకు అనుమతి ఇచ్చినందున భారత్‌కు ఈ కుర్రాడు పతకాన్ని సాధించడం ఖాయమంటున్నారు.


 

ప్రస్తుతం 52 కిలోల బరువున్న దుర్గాప్రసాద్ త్వరలో 10 నుంచి 12 కిలోల బరువు పెరిగితే బోటును అలవోకగా నడిపించగలడని ‘యాచ్ క్లబ్’ సభ్యులు అంటున్నారు. పేద వర్గానికి చెందిన దుర్గాప్రసాద్ తండ్రి లింగం ‘జిరాక్స్ సెంటర్’ను నడుపుతుండగా, తల్లి ఓ ప్రైవేట్ షోరూమ్‌లో పనిచేస్తోంది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్న తన కుమారుడు భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పేరు తెస్తాడని లింగం తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

గోవాలోని భారతీయ నావికాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్ మండోవి’లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న దుర్గాప్రసాద్ నేవీ అధికారిగా జాతికి సేవలందించాలన్నదే తన తపన అంటున్నాడు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ), భారత నావికాదళం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్మీ బోయిస్ స్పోర్ట్స్ కంపెనీ’లో తాను భాగస్వామి కావడం ఎంతో గర్వంగా ఉందంటున్నాడు.