కోహ్లీని చూసి నేర్చుకోండి…

236

అతి త‌క్కువ స‌మ‌యంలో పేరు ప్ర‌తిష్ట‌లతో పాటు టీమిండియా ప‌గ్గాలు చేప‌ట్టిన వ్య‌క్తుల్తో ధోనీ త‌ర్వాత విరాట్ కోహ్లీ నిలుస్తాడు. కెప్టెన్సీలో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన కోహ్లీ బ్యాటింగ్‌లో మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రెండో టెస్టులో‌ కోహ్లీ కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడని ఆయ‌న కొనియాడారు. కోహ్లీ ఫుట్‌వర్క్‌ అద్భుతంగా ఉందని ప్ర‌శంసించారు. స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఎలా ఆడాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు ఆయ‌న సూచించారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ (62)తో అదరగొట్టాడు. అశ్విన్ ‌(106)తో కలిసి ఏడో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు.

ప‌ట్టుద‌ల‌కు మారు పేరు కోహ్లీ:

బ్యాటింగ్‌కు అనూలించ‌డ‌ని పిచ్‌పై విరాట్ కోహ్లీ అమోఘంగా ఆడాడని బాయ్‌కాట్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. ‘భారత్‌లో ఫాస్ట్‌ పిచ్‌లు ఉండవు. అది గొప్ప విషయం. అక్కడ ఆడేటప్పుడు క్రీజులో కుదురుకొని షాట్లు ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పట్టుదలగా ఆడాడు. అతడి ఫుట్‌వర్క్ అమోఘం. బౌల‌ర్ వేసే లైన్ అండ్ లెంగ్త్‌ను కోహ్లీ బాగా అర్థం చేసుకుంటాడు. షాట్ల ఎంపిక కూడా కచ్చితంగా ఉంటుంది. ప్ర‌తికూల‌ పిచ్‌పై కూడా బాగా ఆడొచ్చనే విషయాన్ని కోహ్లీ రుజువు చేశాడు’ అని బాయ్‌కాట్‌ పేర్కొన్నారు.

బెయిర్‌స్టోతో కాకుండా:

రెండో టెస్టుకు జోస్‌ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి బెన్‌ ఫోక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడంపై ఈ మాజీ కెప్టెన్ విమర్శలు చేశారు. ‘బట్లర్‌ విశ్రాంతి కోసం భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చాడు. అయితే అతడి స్థానంలో బెయిర్‌స్టోను కాకుండా ఫోక్స్‌ను ఆడించ‌డం బాధగా ఉంది. కీప‌ర్‌/బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎడ్‌ స్మిత్‌కు ఇష్టం లేదనుకుంటా. అందుకే అతడు ‌ఫోక్స్‌కు అవకాశం ఇచ్చాడు’ అని ఇటీవల టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెఫ్రీ అన్నారు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల్లో బెయిర్‌స్టో బాగా ఆడాడు. తొలి టెస్టులో 47, 35 (నాటౌట్).. రెండో టెస్టులో 28, 29 పరుగులు చేశాడు.

భారత్‌ పరిస్థితులపై చక్కటి అవగాహన:

‘శ్రీలంకలో జానీ బెయిర్‌స్టో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండేళ్ల తర్వాత అతను భారతదేశ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు జానీకి ఇండియాలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. స్పిన్నర్లను బాగా ఎదుర్కొగ‌ల‌డు. అయినా పక్కన పెట్టారు. బెయిర్‌స్టో విషయంలో జట్టు ప్రవర్తించిన తీరు స‌రిగాలేదు’ అని బాయ్‌కాట్‌ పేర్కొన్నారు. నిజంగానే ఇండియాలో బెయిర్‌స్టోకు మంచి రికార్డు ఉంది. అత‌ను ఆరు టెస్టుల్లో 40.11 సగటుతో 361 పరుగులు చేశాడు. ఉపఖండంలో అతని టెస్టు సగటు 40గా ఉంది. అంతేకాదు ఓ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్న జానీకి.. భారత్‌ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది.

24 నుంచి మూడో టెస్ట్:

రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమానం చేసింది. ఇక మూడో టెస్టు (డే/నైట్)ఈనెల 24 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది. సుదీర్ఘ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌తో పాటు టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)‌ తాజాగా ప్రకటించింది. మార్చి 12వ తేదీ నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.