ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలతో అలరించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. మూడేళ్ళ తర్వాత హిందీలో ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించింది ప్రియాంక. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటించారు.
ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ దఢ్‌ఖనే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్ పింక్ వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో జైరా వసీమ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రియాంక తల్లిగా జరీనా నటిస్తుంది. అక్టోబర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్ లో అయేషా అనే పాత్ర పోషిస్తున్న జైరా తన తల్లిదండ్రులు పాండా (ఫర్హాన్) మరియు మూస్ (ప్రియాంక)ల ప్రేమకథను వివరిస్తుంది. తల్లి తండ్రుల రొమాన్స్‌తో పాటు తను పడ్డ బాధలని కూడా వివరించింది.
అయేషా తీవ్రమైన రోగనిరోధక లోపంతో బాధపడుతున్నప్పుడు వారు తమ కుమార్తెను కాపాడటానికి పడ్డ ఇబ్బందులు చూపించారు. అయేషా చౌదరి జీవిత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పిన, అన్నింటిని అధిగమించి మోటివేషనల్ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకుంది అయేషా చౌదరి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.