స్వాతంత్య్ర సమరయోధుడు, తన రచనలతో ప్రజాజీవితాల్లో నిత్యచైతన్యాన్ని నింపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కాళన్న పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్‌కు ప్రభాకర్‌జైనీ దర్శకత్వం వహించనున్నారు. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కాళోజీ 105వ జయంతి సందర్భంగా సోమవారం దర్శకుడు ప్రభాకర్ జైనీ చిత్ర విశేషాల్ని వెల్లడిస్తూ కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలు, ఆయన రచనలు, స్వాతంత్య్రసాధనలో ఆయన సాగించిన పోరాటాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు.
అరుదైన ఫొటోలు సేకరించి స్టోరీలైన్ సిద్ధంచేశాం. సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఈ మహాకవి ఔన్నత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు.
కాళోజీకి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వీ.ఆర్ విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ సహకారంతో స్క్రీన్‌ప్లేకు తుదిరూపమిచ్చిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం అని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. సత్యజిత్ రే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన రవికుమార్ నీర్ల ఈ చిత్రానికి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, రచన, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.