
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఈ రోజు నేను ఒక నటుడిగా కాదు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దర్ని కోల్పోయిన పౌరుడిగా మీ ముందుకు వచ్చాను.
మా అన్నయ్య నందమూరి జానకీ రామ్ ఎంతో జాగ్రత్తపరుడు. మేమైనా అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా కారు, బైక్ నడిపేవాళ్లం. కానీ ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండేవారు.
ఆయన జాగ్రత్తగానే వెళ్తున్నప్పటికీ.. జాతీయ రహదారి మీద ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వచ్చింది. అకస్మాత్తుగా నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఈ ప్రమాదంలో అన్నయ్య చనిపోయారు.
“రెండోది మా నాన్న గారు.. నందమూరి హరికృష్ణ గారు.. చైతన్య రథం నడుపుతూ.. మా తాతగారిని 33 వేల కిలోమీటర్లు.. ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించేలా చేశారు.
నాన్న ఎంతో జాగ్రత్తపరుడు. కానీ ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. రోడ్డు ప్రమాదానికి గురై అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళారు” అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
“వాహనంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు. దయచేసి మీ కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు.. మీ మీద ఆధారపడిన వారు ఎదురు చూస్తుంటారు.
రూల్స్‌ను కఠినంగా అమలు చేయడం వల్లగానీ.. శిక్షలు విధించడం వల్ల గానీ మనలో మార్పు రాదు. కరోనా లాంటి భయం
కరమైన వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది గానీ.. రోడ్డు ప్రమాదాలకు అలా కాదు. మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనల్ని మనం మార్చుకోవాలి.
పౌరులందరికీ నా రిక్వెస్ట్.. దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ కుటుంబ సభ్యుల కోసం బాధ్యతతో మిమ్మల్ని మీరు మార్చుకోండి” అని తారక్ వాహనదారులకు రిక్వెస్ట్ చేశారు. .