రోహిత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన గ‌ప్టిల్‌

241

న్యూజిలాండ్ సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ మార్టిన్ గ‌ప్టిల్ టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

రోహిత్ పేరుతో టీ20ల్లో ఉన్న రికార్డున గ‌ప్టిల్ తిర‌గ‌రాశాడు. ఆస్ట్రేలియాతో గురువారం (25-2-2021) జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గ‌ప్టిల్ కేవ‌లం 50 బంతుల్లో 97 ప‌రుగులు చేశాడు.

ఇందులో 8 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ20ల్లో రోహిత్ శ‌ర్మ రికార్డును అధిగ‌మించాడు. గ‌ప్టిల్ ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్స‌ర్ల‌తో అత‌ను 96 టీ20ల్లో 132 సిక్స్‌లు కొట్టిన‌ట్ట‌యింది.

రోహిత్ శ‌ర్మ 108 మ్యాచ్‌ల్లో 127 సిక్స‌ర్లు న‌మోదు చేశాడు. అయితే ఈ జాబితాలో విండీస్‌కు చెందిన విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మ‌న్ క్రిస్ గేల్ 105 సిక్స‌ర్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

గేల్ 58 మ్యాచ్‌ల్లోనే ఈ సిక్స‌ర్లు సాధించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 97 మ్యాచ్‌ల్లో 113 సిక్స‌ర్లు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 ప‌రుగుల‌తో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 219 ప‌రుగులు చేసింది.

గ‌ప్టిల్ వీర‌విహారం చేశాడు. త‌ర్వాత ఆడిన ఆస్ట్రేలియా గెలుపు దిశ‌గా దూసుకెళుతున్న‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ 5 ప‌రుగుల దూరంలో నిలిచిపోయింది.

చివ‌రి ఓవ‌ర్లో ఆస్ట్రేలియా గెలుపుకు15 ప‌రుగుల కావాల్సిన స‌మ‌యంలో కివీస్ బౌల‌ర్ నీష‌మ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ప‌రుగులు మాత్ర‌మే ఇవ్వ‌డంతో ఆస్ట్రేలియాకు మ‌రో ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు.

అంతేకాకుండా చివ‌రి ఓవ‌ర్లో నీష‌మ్ రెండు వికెట్లు కూడా తీశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మార్క‌స్ స్టొయినిస్ 37 బంతుల్లోనే 78 ప‌రుగులు చేశాడు.

కానీ స్టొయినిస్ పోరాటం ఆస్ట్రేలియాను గెలిపించ‌లేక‌పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంతో నిలిచింది.