మరోసారి వివాదంలో “క్రాక్”… నిర్మాతపై దర్శకుడి ఫిర్యాదు

142
Krack

మాస్ మహారాజా రవితేజ నటించిన “క్రాక్” చిత్రం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం “క్రాక్”. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2021లో విడుదలైన మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు అందుకుని భారీ హిట్ గా నిలిచింది.

అయితే సినిమా విడుదల రోజే ఆర్ధిక కారణాల వల్ల “క్రాక్” మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి “క్రాక్” సినిమా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత ఠాగూర్ మధుపై ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

“క్రాక్” సినిమా బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని, పెండింగ్ రెమ్యునరేషన్ తనకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గోపీచంద్ మలినేని కోరినట్టు సమాచారం. నిర్మాత ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక “క్రాక్” ఫిబ్రవరి 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 29నే “క్రాక్” ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా… అనివార్య కారణాల వల్ల నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా రాజా ది గ్రేట్ తరువాత రవితేజకు సరైన హిట్ దక్కలేదు. ఇప్పుడు మళ్ళీ “క్రాక్”తో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు శృతి హాసన్ కు కూడా ఈ చిత్రం హిట్ మంచి జోష్ ను ఇచ్చింది. అయితే ఈ చిత్రం వివాదాస్పదం కావడం రవితేజ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.