‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిన నిహారిక ఈసారి ఏకంగా సూర్యకాంతం అవతారం ఎత్తింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రమే ‘సూర్యకాంతం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిహారిక సరసన స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు, ‘ఈ మాయ పేరేమిటో’ ఫేమ్ రాహుల్ విజయ్ నటించారు. వరుణ్ తేజ్ సమర్పణలో మార్చి 29న ‘సూర్యకాంతం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అబ్బో.. సూర్యకాంతానికి మామూలు టెక్కు కాదు.. పేరు అడిగితే ‘నా పేరు తెలుసుకుని ఏం చేస్తావ్.. రేప్పొద్దున్న నీకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటావా?’ అంటూ గడుసరి సమాధానం చెప్తోంది. మెగా డాటర్ నిహారిక నటిస్తున్న ‘సూర్యకాంతం’ టీజర్‌లోనిది ఈ ముచ్చట. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడ్రన్ సూర్యకాంతంగా ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
టీజర్ మొత్తం ఫన్‌ని జనరేట్ చేస్తూ.. డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తుంది మెగా డాటర్. తను ఎదుటి వారికి పేరు చెప్పకపోగా.. ఎవరైనా పేరు, వివరాలు చెప్తుంటే.. ‘చాల్లే.. నీ పేరు.. అంతకన్నా తెలుసుకుని నేను ఏం చేస్తా’ అంటూ టీజర్‌లో సందడి చేస్తుంది. ‘తినడానికి పునుగులు లేవు కాని.. బెగ్గర్‌కి బర్గర్ తినిపించాడంట నీలాంటి వాడే’ అంటూ ప్రాసను ప్రవాహంలా వాడేస్తుంది ఈ సూర్యకాంతం. ఇక టీజర్ ఎండింగ్‌లో వచ్చే సీన్ కేకపెట్టించేటట్టే ఉంది.. ‘నేను ఐదు లెక్కపెట్టేలోపు పెళ్లికి ఒప్పుకోకపోతే చేయి కోసుకుంటా అని సుహాసిని బెదిరించడం.. వెంటనే ‘సూర్యకాంతం’ ఐదు అంకెల్ని ఫాస్ట్‌గా లెక్కపెట్టేయడం’ ఈ సూర్యకాంత ఏం పిల్లమామా అనేట్టే ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సూర్యకాంతాన్ని మీరూ చూసేయండి.