కరోనా కారణంగా గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది భారత్ అభిమానలను అలరించనుంది.
ఈ ఏడాది సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం ఈ రోజు (18-2-2021) చెన్నైలో జరగనుంది. మరి కొద్ది సేపట్లో ఈ వేలం అంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ వేలం పాటలో మొత్తం 292 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు 61 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశముంది.
భారత ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు ఈ వేలంలో ఉండటం ఆసక్తి రేపుతోంది.
ఈ వేలంలో దేశవాళీ కుర్రాళ్లకు మంచి ధర పలికే అవకాశముండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వేలంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలనేపై అందరి దృష్టి నిలిచింది.
మలన్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 ఆటగాడు. దీంతో ఈ సీజన్‌తో మలన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు గతేడాది ఐపీఎల్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఈసారి ఫ్రాంచైజీలు ఏ ధరను ఇస్తాయో చూడాలి.
ఈ ఆటగాడిని సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య పోటీ తీవ్రత ఎక్కువైతే మ్యాక్స్‌వెల్‌కు మంచి ధర లభించే అవకాశముంది.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీకి కూడా ఈ వేలంలో మంచి ధర లభించొచ్చు. ఈ ఆటగాడిని కూడా చెన్నై జట్టు సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది.
వేలంలో పాల్గొనే మొత్తం ఆటగాళ్లు: 292 మంది
- భారత్ ఆటగాళ్ల సంఖ్య: 164
- విదేశీ క్రికెటర్లు: 125
- అసోసియేట్ దేశాల నుంచి: 3
- జట్లలో ఖాళీ స్థానాలు: 61
- విదేశీ ఆటగాళ్ల సంఖ్య: 22