
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మొతేరా (నరేంద్ర మోదీ) స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ (డే/నైట్) రసవత్తరంగా మారింది.
తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్ జట్టు కోహ్లీ సేనను 145 పరుగులకే ఆలౌట్ చేసింది. టీమిండియాను దెబ్బ తీయడంలో ఇంగ్లండ్ స్పిన్నర్ జో రూట్ కీలకపాత్ర పోషించాడు.
లీచ్ కూడా అందులో భాగస్వామి అయ్యాడు. 3 వికెట్ల నష్టానికి 99 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా 145 పరుగులకే టపా కట్టేసింది.
రూట్ ఐదు వికెట్లు తీయడంతో మరో 46 పరుగులకే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.
ఆట ప్రారంభమైన కాసేపటికే రహానేను పెవిలియన్ చేర్చిన లీచ్.. మరి కొద్దిసేపటికి రోహిత్ శర్మ (66) వికెట్ తీసుకున్నాడు.
రెండో రోజు పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో జో రూట్ రంగంలోకి దిగి బంతితో మాయ చేశాడు. తొలి బంతికే రిషబ్ పంత్‌ను పెవిలియన్ పంపాడు.
తర్వాత ఒకే ఓవర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను వికెట్లను తీసుకున్నాడు. దీంతో మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు.
టీమిండియా 131 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారీ షాట్‌కు యత్నించిన రవిచంద్రన్ అశ్విన్ (17) జో రూట్ బౌలింగ్‌లోనే జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
చివర్లో రూట్ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీగా అవుట్ కావడంతో 145 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
రూట్ టెస్టు కెరీర్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇంగ్లాండ్ కెప్టెన్ కేవలం 6.2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.