
గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ను ఇలియానా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె నేరుగా వెల్లడించకపోయినా.. సోషల్‌మీడియాలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘హబ్బీ’ (భర్త) అని సంబోధిస్తుంటారు.
అయితే ఇప్పుడు ఇలియానా తల్లి కాబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ‘రెయిడ్’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా తాను గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు తేలికైన దుస్తులు ధరించారని బీటౌన్ వర్గాలు అంటున్నాయి. అదీకాకుండా ఆండ్రూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోను షేర్ చేశారు. ఫొటోలో ఇలియానా బాత్‌టబ్‌లో సేదతీరుతూ కాఫీ తాగుతూ కన్పించారు. ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అని క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా పెళ్లి గురించే ఓ క్లారిటీ ఇవ్వని ఇలియానా ఇక ఈ విషయం గురించి ఏమని చెప్తారో వేచి చూడాలి.