ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అద్భుత అంతరిక్ష పరిశోధనలతో తన సత్తా చాటుతున్నది. మార్స్ గ్రహం మీదకు కూడా భారత్‌కు చెందిన అంతరిక్ష సంస్థ ఇస్రో ఉపగ్రహాన్ని పంపించింది. ఇస్రో మంగళ్‌యాన్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ‘పరిశోధనలు లేనిదే సైన్స్ లేదు. పరిశోధనలు చేయకుండా మనకి మనం శాస్త్రవేత్తలం అని చెప్పుకోలేం’ అంటున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అయితే ఆ కథాంశంతో రూపొందుతున్న మిషన్ మంగళ్ సినిమాకు చెందిన ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్‌యాన్’ మిషన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ మూవీలో అక్షయ్‌కుమార్.. రాకేశ్ ధావన్ శాస్త్రవేత్త పాత్రను పోషిస్తున్నారు. ఇక మరో శాస్త్రవేత్త తారా షిండే పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరక్టర్ జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ‘ఒక దేశం, ఒక కల, ఒక చరిత్ర.. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్ కథ ఆధారంగా రాబోతున్న చిత్రం టైలర్ ఇదే. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ.. ట్రైలర్ వీడియోను షేర్ చేశారు.
మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపించాలని శాస్త్రవేత్త రాకేశ్ ధావన్ (అక్షయ్) ప్రతిపాదన తెస్తారు. ‘ఇది చేయడానికి మనకు అనుభవజ్ఞులు కావాలి సర్’ అని శాస్త్రవేత్త అయిన తారా షిండే(విద్యా బాలన్).. రాకేశ్‌తో అంటారు. ఇందుకు రాకేశ్ స్పందిస్తూ.. ‘అంగారకుడిపైకి వెళ్లడానికి ఇస్రోలో ఎవరికి అనుభవం ఉంది. ఏదేమైనా మంగళ్‌యాన్‌ను మార్స్‌పైకి పంపి తీరాల్సిందే’ అంటారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలంతా కలిసి భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ఈ ఘట్టాన్ని ఎలా సాధించారన్నది తెరపై చూడాలి.