తొలి టీ20లో కివీస్ గెలుపు

283

ఆస్ట్రేలియాతో సోమ‌వారం క్రైస్ట్‌చ‌ర్చిలో ప్రారంభ‌మైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో న్యూజిలాండ్ జ‌ట్టు 53 ప‌రుగుల తేడాతో గెలిచింది. సోమ‌వారం క్రైస్ట్‌చ‌ర్చిలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ట న‌ష్టానికి 184 ప‌రుగులు చేసింది.

అయితే గెల‌వ‌గ‌ల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు 17.3 ఓవ‌ర్ల‌లో 131 ప‌రుగుల‌కు ట‌పాక‌ట్టేశారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో బ‌రిలోకి దిగిన కివీస్ జ‌ట్టులో ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ డ‌కౌట్ కాగా.. మ‌రో ఓపెనర్ టిమ్ సీఫ‌ర్ట్ 1 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు.

దీంతో కివీస్ జ‌ట్టు 11 ప‌రుగుల‌కే రెండు కీల‌క‌మైన వికెట్లు కోల్పోయింది. త‌ర్వాత వ‌చ్చిన కేన్ విలియ‌మ్స‌న్‌, డెవాన్ కాన్వే క‌లిసి జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ జ‌ట్టు స్కోరు 19 ప‌రుగుల వ‌ద్ద విలియ‌మ్స‌న్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. త‌ర్వాత వ‌చ్చిన గ్లెన్ ఫిలిప్స్‌తో క‌లిసి డెవాన్ కాన్వే జ‌ట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించారు.

వీరిద్ద‌రు మూడో వికెట్‌కు చాలా వేగంగా 36 ప‌రుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే గ్లెన్ ఫిలిప్స్ అవుటైన త‌ర్వాత బ‌రిలోకి దిగిన జేమ్స్ నీష‌మ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

15 బంతుల్లో 26 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు. మ్యాచ్ చివ‌ర్లో వ‌చ్చిన మిచెల్ సాంట్న‌ర్ (7), డెవాన్ కాన్వే (99) నాటౌట్‌గా నిల‌వ‌డంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

అయితే డెవాన్ కాన్వే చివరి వ‌ర‌కు క్రీజులో ఉండి సెంచ‌రీ సాధించ‌లేకపోవ‌డం అభిమానుల‌ను నిరాశ ప‌రిచింది. త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టులో మిచెల్ మార్ష్ జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

అత‌ను 45 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్‌లో మాథ్యూవేడ్ (12), ఆష్ట‌న్ అగార్ (23), జై రిచ‌ర్డ్‌స‌న్ (11), ఆడ‌మ్ జంపా (13) రెండంకెల స్కోర్లు చేశారు.

మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 1-0 ఆధిక్యంతో నిలిచింది.