ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో దాదాపు 543 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. నవంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా మొత్తాన్ని శంకర్ 3డీ కెమెరాలతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండగా, వీటికి సంబంధించిన వర్క్ విదేశాలలో జరిపారు. ప్రస్తుతం చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ట్రైలర్ లాంచ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, శంకర్, అమీ జాక్సన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ట్రైలర్‌ని 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేయగా, ఇది ప్రేక్షకులకి చాలా థ్రిల్ కలిగిస్తుంది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకునేలా చేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారనుంది. పలువురు హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకి పని చేయగా, చిత్రం ప్రతి సినీ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలిగించనుందని అంటున్నారు. భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 4డీ సౌండ్ టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి.