యూసఫ్‌ పఠాన్ రిటైర్మెంట్‌

249

టీమిండియా సీనియ‌ర్ ఆట‌గాడు యూసఫ్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ విషయాన్ని యూస‌ఫ్ ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఈ రోజుతో అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్నా అని అన్నారు.

ఇంతకాలం నా వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, స్పేహితులకు, అభిమానులకు, కోచ్‌లకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాఅని ట్విట్ట‌ర్‌లో రాశాడు.

ఈ బరోడా ఆల్‌రౌండర్‌ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున 57 వన్డేల్లో 810 పరుగులు.. 22 టీ20ల్లో 232 పరుగులు చేశాడు.

వన్డేల్లో 2 సెంచరీలు, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. యూసఫ్‌ పఠాన్‌ పవర్‌ హిట్టర్‌గా పేరు పొందాడు.

టీమిండియా తరపున ఎక్కువసార్లు ఫినిషర్‌గా ఆడిన యూసఫ్‌ పఠాన్‌ 2012 తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించ‌లేక‌పోయాడు.

లేటు వయసులో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూసఫ్‌ కెరీర్‌లో కొన్ని మొమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఉన్నాయి. 2010లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యూసఫ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు.

4వ వన్డేలో అజేయ 129 పరుగుల ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2011 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 70 బంతుల్లోనే 105 పరుగులు సాధించాడు.

ఆల్‌రౌండర్‌ కోటాలో 2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాధించాడు. ఆ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులో భాగస్వామ్యం కావడం అతని కెరీర్‌లో మరిచిపోలేనిది చెప్పొచ్చు.

అయితే ప్రపంచకప్‌ తర్వాత పఠాన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోయింది. దీంతో సెలెక్టర్లు కూడా అతని పేరు మ‌ర్చిపోయారు. దీంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అలా పఠాన్‌ కెరీర్‌ ముగిసిందనే చెప్పొచ్చు.

ఇక ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌ 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడాడు. రాజ‌స్థాన్ జ‌ట్టు టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఆ తర్వాత సీజన్లలోనూ యూసఫ్‌ పఠాన్‌ కేకేఆర్‌, పుణే వారియర్స్‌, సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

2018లో చివరిసారి ఐపీఎల్‌లో పాల్గొన్న యూసఫ్‌ ఆ తర్వాత సీజన్‌లో వేలంలోకి వచ్చినా ఎవ్వ‌రూ అతన్ని కొనుగోలు చేయ‌లేదు.

తాజాగా బుధవారం (ఫిబ్రవరి 24న) హైదరాబాద్‌కు వచ్చిన యూసఫ్‌ పఠాన్‌ పఠాన్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించాడు.