బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు

250

కూతురుగా, చెల్లిగా, అక్క‌గా, త‌ల్లిగా అనేక బాధ్య‌త‌లు నిర్వర్తిస్తుంది స్త్రీ. పురుష స‌మాజానికి స్త్రీ చేసే సేవ‌లు విలువ క‌ట్ట‌లేనివి.

నేడు (8-3-2021) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. పేరుకే మ‌హిళా దినోత్స‌వం.

ఈ ఒక్క రోజే మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతాం. మిగతా 364 రోజులు ఆమే చేసే సేవ‌ల‌ను మ‌ర్చిపోతాం.

మ‌ళ్లీ స్త్రీ అంటే ఆట బొమ్మ‌గానే చూస్తాం. మ‌హిళా దినోత్స‌వం రోజున ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద విధులు నిర్వహిస్తూ కెమేరాకు చిక్కింది.

ఈ వీడియోపై నెటిజనుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చండీగడ్‌లోని ఓ ప్రధాన కూడలిలో రౌండ్ అబౌట్ వద్ద ప్రియాంక అనే మహిళ కానిస్టేబుల్ బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది.

ఇది గమనించిన స్థానిక విలేకరి గంగదీప్ సింగ్ ఈ దృశ్యా్న్ని వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ రోజు 8న) మహిళల‌ దినోత్సవం కావడంతో ఇది మరింత ట్రెండవుతోంది.

నిబంధ‌న‌ల‌ను మార్చ‌లేమా?

‘‘మార్చి 5న చండీగడ్‌లోని సెక్టార్ 15-23 వద్ద ఉయదం 11 గంటలకు కానిస్టేబుల్ ప్రియాంక తన బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తోంది.

చిన్న బిడ్డను దూరంగా పెట్టి ఏ తల‌యినా ప్ర‌శాంతంగా డ్యూటీ చేయ‌గ‌ల‌దా? ఇలాంటి తల్లుల కోసం నిబంధనలను మార్చాల్సిన అవసరముంది’’

అని పేర్కొన్నాడు. స్థానిక పత్రికల సమాచారం ప్రకారం ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రియాంక ఉదయం 8 గంటలకు డ్యూటీకి హాజరుకావల్సి ఉంది.

ఆలస్యం కావడంతో ఆమె నేరుగా తన బిడ్డతో విధుల్లో చేరింది. అధికారులు లీవ్ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పినా ఆమె డ్యూటీ చేసేందుకే

సిద్ధమైంది. అయితే నెటిజనులు మాత్రం ఆమె అలా చేయడం మంచిది కాదంటున్నారు. కాలుష్యంలో చిన్నారిని ఎత్తుకుని విధులు నిర్వహించడం తగదన్నారు.

మ‌హిళా నీకు వంద‌నం

బిడ్డను డే కేర్‌లో అప్పగించి విధులకు హాజరుకావచ్చు కదా అని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం మహిళా నీకు వందనం అని ఆమెను

కొనియాడుతున్నారు. ఈ వీడియోను కొందరు చండీగడ్ డీజీపీ సంజయ్ బెనివాల్‌కు ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఆయన స‌మాధాన‌మిస్తూ

‘‘ఇటీవలే ఆమె మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరింది. చైల్డ్ కేర్ లీవ్ తీసుకోడానికి కూడా ఆమెకు అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆమె పోలీస్ లైన్స్ వ‌ద్ద విధులు నిర్వహిస్తోంది. ఆమె కావాలంటే ఆఫీస్‌లో పనిచేసేందుకు రిక్వెస్ట్ పంపవచ్చు’’ అని తెలిపారు.