అభాగ్యుడికి అమ్మలా భోజ‌నం పెట్టిన మహిళా అధికారి

301

చ‌దువుకున్న అభాగ్యులు రోడ్ల‌పై మ‌న‌కు ఎంతో మంది తార‌స‌ప‌డుతుంటారు.

కానీ మ‌న ప‌రిస్థితి బాగోలేక అయ్యో పాపం అనుకోవ‌డం త‌ప్ప ఏమీ ఏయ‌లేని దుస్థితి మ‌న‌ది.

కొంత మంది డ‌బ్బున్న వాళ్లు, ఉన్న‌తాధికారులు ఇలాంటి వాళ్ల‌ను చూసి చీద‌రించుకుంటారే త‌ప్ప ద‌గ్గ‌రికి కూడా రానీయ‌రు.

కానీ ఓ మ‌హిళాధికారి ఓ అభాగ్యుడికి క‌న్న‌తల్లిలా అన్నం పెట్టిన దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

కొన్ని ఫొటోలు వేల భావాలను పలికిస్తాయి. అలాంటి చిత్రమే ఇది. కొందరి మానవత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

ఎల్లలు లేని మానవత్వానికి సజీవ సాక్ష్యం ఇది. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడిని చూసి అమ్మ అవతారం ఎత్తారు ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళా అధికారి.

తన లంచ్‌ బాక్స్‌ని ఓపెన్ చేసి ఆ అభాగ్యుడికి స్వయంగా తినిపించారు. మానవతావాదులతో జేజేలు అందుకుంటున్నారు.

ములుగు మండలంలోని మల్లంపల్లిలో ఓ వ్యక్తి మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్నాడు. ఆకలికి తాలలేక మట్టిలో నుంచి ఏది పడితే అది తీసి నోట్లో పెట్టుకున్నాడు.

ములుగు రెవెన్యూ కార్యాలయంలో సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్న తస్లీమా ఆ దయనీయ దృశ్యాన్ని గమనించారు.

అభాగ్యుడి దీనస్థితి చూసి చలించిపోయిన సబ్ రిజిస్టార్ తస్లీమా వెంటనే తన లంచ్ బాక్స్‌ను తీసుకొని అతడి వద్దకు వచ్చారు.

మతిస్థిమితం లేని ఆ వ్యక్తి మూతి కడిగి స్వయంగా తినిపించారు. అమ్మలా గోరుముద్దలు పెట్టారు. అక్కడే ఉన్న కొంత మంది ఆ దృశ్యాలను తమె సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదంటారు.

కానీ ఈ అధికారి తస్లీమా మాత్రం అడ‌గ‌కుండానే మానవతా దృక్పథంతో స్పందించారు.

సాధారణంగా అలాంటి వ్యక్తులను చూసి కొంత మంది దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయరు. అలాంటిది ఇలా సాయం చేయాలంటే చాలా ధైర్యం కావాలి.

అందుకే తస్లీమా మంచి మనసుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.