ఆన్‌లైన్‌లో ఆర్‌టీఓ సేవలు

299

కొత్త‌గా బండి కొన్న వాళ్లు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్‌టీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు.

అక్క‌డ ఉండే ద‌ళారుల‌కు డ‌బ్బులు ముట్ట చెబితే కాని ప‌న‌వ్వ‌దు. లైసెన్స్ రెన్యూవ‌ల్‌తో పాటు అనేక ప‌నుల కోసం ఆర్‌టీఓ ఆఫీసు చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంది.

ఇటు ఉద్యోగం చూసుకుంటూ ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది ప‌డాల్సివ‌స్తుంది. ఇక నుంచి ఇటువంటి బాధ‌లుండ‌వ్‌.

ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లకుండానే మీరు అన్ని అనుమతులు పొందొచ్చు. ఎలాగంటే కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది.

డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌తో పాటు మరికొన్ని సేవలు ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చంటూ కేంద్ర రహదారి,రవాణా మరియు హైవే మంత్రిత్వశాఖ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది

ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

రవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది.

ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాల‌యానికి వెళ్లే పనిలేకుండా పలు సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందేలా చర్యలు తీసుకుంది.

అంటే కేవలం ఆధార్ వివరాలతో ఒక వాహనదారుడు కొత్త లైసెన్స్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఆన్ లైన్‌ ద్వారా రెన్యూవల్ చేసుకునే వీలును కూడా ఉంది.

ఆన్‌లైన్ ద్వారానే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందే అవకాశం క‌ల్పిస్తున్నారు.

ఇకపై పలు రవాణాసేవలను ప్రజలకు సులభంగా అందేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఇందులో మొత్తం 18 సేవలను ఆన్‌లైన్ ద్వారా కల్పిస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ పేర్కొంటూ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

ఆధార్‌ ప్రామాణికతతో సేవలు

కేంద్ర రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది.

సులభతరమైన పాలన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందిస్తామని పేర్కొంది.

రవాణారంగంలో ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగా ఆధార్ ప్రామాణీకరణ చేయించుకోవాలని సూచించింది.

ప్రజలకు ఆన్‌లైన్ సేవలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున మీడియా ద్వారా ప్రచారం ఇప్పిస్తామని తెలిపింది.

పలు చోట్ల నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తామని ప్ర‌భుత్వం పేర్కొంది. ఒక్కసారి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తే ఆర్టీఓ కార్యాలయం దగ్గర రద్దీ తగ్గుతుందని వెల్ల‌డించింది.

అదే సమయంలో సిబ్బంది కూడా మరింత పనిచేసేలా వెసులుబాటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

ఆన్‌లైన్‌లో మొత్తం 18 సేవలు

2021 మార్చి 3 నుంచి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 18 సేవలు ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లకుండానే వాహనదారులు ఆన్‌లైన్‌లో పొందొచ్చు.

  • లెర్నింగ్ లైసెన్స్
  • డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
  • డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్
  • డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌పై అడ్రస్ మార్పులు
  • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ
  • లైసెన్స్ ద్వారా వెహికల్ సరెండర్ చేయడం
  • మోటార్ వాహనం టెంపరరీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • డూప్లికేట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • ఆర్‌సీ ఎన్‌ఓసీ జారీకి అప్లికేషన్
  • మోటార్ వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్ నోటీసు
  • మోటార్ వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్
  • సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌పై అడ్రస్ మార్పు కోరుతూ సమాచారం
  • గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి డ్రైవర్ ట్రైనింగ్ పొందేందుకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • డిప్లొమాటిక్ ఆఫీసర్‌కు చెందిన మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • డిప్లొమాటిక్ ఆఫీసర్‌కు చెందిన వాహనం కొత్త రిజిస్ట్రేషన్ అప్లికేషన్
  • కిరాయి-కొనుగోలు ఒప్పందం ఆమోదం
  • కిరాయి-కొనుగోలు ఒప్పందం ముగింపు డాక్యుమెంట్