షేవింగ్‌కు బంగారు రేజర్‌

397

క‌రోనా వైర‌స్ కొట్టిన దెబ్బ‌కు చాలా మంది చాలా కోల్పోయారు. ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాల్లో న‌ష్టాలు వ‌చ్చాయి.

వ్యాపారాలు మ‌ళ్లీ పుంజుకోవాలంటే కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో మొద‌లు పెట్టాల్సి వ‌స్తోంది. వెరైటీ ఆలోచనలతో ముందుకెళ్తున్న కొందరికి లాభాలు వ‌స్తున్నాయి.

ఇందుకు పుణెకు చెందిన ఈ బార్బరే నిదర్శనం. అవినాష్ అనే బార్బ‌ర్ పింప్రీ చించ్వాడ్‌లో నివసిస్తున్నాడు. ఇత‌నికి బొరుండియాలో సెలూన్ దుకాణం ఉంది.

కరోనా వైరస్ వల్ల అది మూతపడింది. అన్‌లాక్ త‌ర్వాత దుకాణం తెరిచినా కస్టమర్లెవ్వ‌రూ సెలూన్‌కు వచ్చేవారు కాదు. దీంతో కొన్నాళ్లు సెలూన్ మూసేశాడు.

ఇటీవల మళ్లీ కొత్త ఆలోచనతో సెలూన్ ఓపెన్ చేశాడు. ‘మా సెలూన్‌లో బంగారు రేజర్‌తో త‌క్కువ ధ‌ర‌కే షేవింగ్ చేయించుకోండి’ అనే బోర్డు పెట్టాడు.

కస్టమర్ల దృష్టి అవినాష్ సెలూన్‌పై పడింది. కస్టమర్లను ఆకట్టుకోడానికి ఏదైనా కొత్తగా చేయాలని అవినాష్ భావించాడు.

అందులో భాగంగానే గోల్డెన్ రేజర్‌ ఐడియా. రూ.4 లక్షలు వెచ్చించి 80 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా రేజర్ తయారు చేయించాడు.

అవినాష్ అనుకున్న‌ట్టుగానే ఈ రేజర్‌తో షేవింగ్ చేయించుకోడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఈ షేవింగ్ కోసం కస్టమర్లు రూ.100 చెల్లిస్తే చాలని అవినాష్ తెలిపాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బార్బర్ కూడా ఇదే తరహాలో కస్టమర్లను ఆకట్టుకున్నాడు.

గోల్డెన్ సిజర్ (బంగారు కత్తెర)తో జుట్టు కత్తిరిస్తూ వైరల్ అయ్యాడు.