కొండ‌వానిపాలెంలో భారీ అగ్ని ప్ర‌మాదం

244

భారీ అగ్ని ప్ర‌మాదం గిరిజ‌నుల‌ను రోడ్డు మీద ప‌డేసింది. ఇందులో 40 గుడిసెలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి.

ఇందులో నాలుగు స్లాబ్ ఇళ్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి.

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొండుప‌ల్లి మండ‌లంలోని దేవుల‌ప‌ల్లి గ్రామ పంచాయితీ ప‌రిధిలో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభ‌వించింది.

తొలుత కరాచీ కుమారి ఇంటికి సమీపంలో పశువుల శాల వద్ద మంటలు చెలరేగాయి. ఆ తర్వాత గ్రామం మొత్తం వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో ధాన్యం, దుస్తులు, దాచుకున్న డబ్బులు స‌ర్వ‌స్వం అగ్నికి ఆహుత‌య్యాయి. దీంతో బాధితులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారి కె. అప్పారావు తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు.

నీటి సదుపాయం లేకపోవడంతో రెండు ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు.

అయితే తహసీల్దార్ సీతా రామరాజు, ఆర్ఐ పార్థసారథి, వీఆర్ఓ నాగరాజులు బాధితులను పరామర్శించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

అగ్ని ప్రమాద బాధితులకు స్థానిక నాయకులు భోజన ఏర్పాట్లు చేశారు.

మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ అచ్చెన్నాయుడు, పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్, వార్డు సభ్యుడు రాపాక సాయి సురేష్ బాధితులను పరామర్శించారు.

ఈ ప్రమాదంలో కనీసం రూ. 40 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సర్వస్వం కోల్పోయిన తమను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.