భారీ రేటుకు అమ్ముడైన “ఉప్పెన” థియేట్రికల్ రైట్స్

174
Uppena Pre Release Business

చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “ఉప్పెన”. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.

వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఈనెల 12 భారీ ఎత్తున విడుదలవుతోన్న “ఉప్పెన” ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీగా ఉంది.

“ఉప్పెన” ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. “ఉప్పెన” నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు విక్రయించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు విక్రయించిందట.

ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లని అంటున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటాలంటే సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా “ఉప్పెన” ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

తొలిరోజు సుమారు రూ.7 కోట్లు వసూలవుతుందని అంచనావేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలను కూడా పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలను రూ.150 చేశారు.