
మహా భారతం అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ద్రౌపది పాండవులను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ కలియుగ ద్రౌపది కూడా నలుగురిని ప్రేమించింది.
ఆ నలుగురినీ పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది. చివరికి వాళ్లంతా ఎక్కడున్నారో తెలుసుకుని గ్రామానికి తెచ్చి పంచాయితీ తీర్చారు పెద్దలు.
వివరాల్లోకి వెళితే… ఆమె మనసు చాలా విశాలమైనది. అందుకే ఒకేసారి నలుగురు కుర్రాళ్లను ప్రేమించింది.
అంతేకాదు ఆ నలుగురితో కలిసి జీవించేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ నలుగురు యువకుల కుటుంబికుల్లో ఒకరికి వారెక్కడున్నారన్న ఆచూకీ లభించింది.
దీంతో ఆ ఐదుగురిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. నలుగురిలో ఒకరిని ఎంపిక చేసుకుంటే పెళ్లి చేస్తామని కుటుంబికులు చెప్పారు.
కానీ ఆమె తనకు నలుగురు ఇష్టమేనని ఎంపిక చేసుకోవడం కష్టంగా ఉందని తెలిపింది. దీంతో ఈ గొడవ రచ్చబండకు చేరింది.
పంచాయతీ పెద్దలకు కూడా ఆమె అదే విషయం చెప్పింది. దీంతో పెద్దలు లక్కీ డ్రా ద్వారా ఆమెకు భర్తను ఎంపిక చేశారు.
ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని అంబేద్కర్ నగర్‌లో చోటుచేసుకుంది.
అజ్మీర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నలుగురు యువకులు తండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యువతితో ప్రేమలో పడ్డారు.
ఆమె కూడా ఆ నలుగురిని పీకల్లోతు ప్రేమించింది. ఇటీవల ఆ నలుగురితో ఇంటి నుంచి లేచిపోయింది.
ఈ విషయం తెలిసి యువతి కుటుంబికులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే గ్రామ పెద్దలు వారిని వారించారు. మొత్తానికి ఆ ఐదుగురిని తిరిగి ఊరికి తీసుకొచ్చిన గ్రామస్తులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోలేక గందరగోళానికి గురైంది.
దీంతో పంచాయతీ పెద్దలు వారి కుటుంబికులతో చర్చించారు. ఆ నలుగురిలో ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని యువతికి చెప్పారు.
ఆ సమయంలో ఆమె తన నిర్ణయం చెప్పలేకపోయింది. దీంతో వేరే మార్గం లేక లక్కీ డ్రా తీయాలని పెద్దలు నిర్ణయించారు.
నలుగురు యువకుల పేర్లను నాలుగు చీటీలపై రాసి ఓ పాత్రలో పెట్టారు. యువతి ఆ నాలుగు చీటిల్లో ఒకటి తీసింది.
అందులో ఎవరు పేరు ఉంటే వారినే పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పడంతో ఆమె అంగీకరించింది.
మొత్తానికి కథ అలా సుఖాంతమైంది. కానీ మిగతా ముగ్గురిపై ఆమె ప్రేమను చంపుకోగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.