30 ఏళ్లుగా పెళ్లికూతురు దుస్తుల్లో పురుషుడు

394

లింగ మార్పిడి చేసుకున్న వాళ్ల‌ను చూశాం. డ్రామాలో వ‌ధువు వేశం వేసిన పురుషుల‌నూ చూశాం.

ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ అనే కామిడీ షోలో ఆడ వేశాలు వేస్తున్న పురుషుల‌నూ చూస్తున్నాం.

కానీ ఓ పురుషుడు గ‌త 30 ఏళ్లుగా నిత్యం పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడు.

అత‌ను చెప్పే విష‌యాలు వింటే నిజంగా ఇలాంటివి జ‌రుగుతాయా అని ఆశ్చ‌ర్యపోక మాన‌రు.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హౌజ్‌ఖాస్‌లోని జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన చింతహరణ్ చౌహాన్ (66) అనే వ్యక్తి ఉన్నాడు.

అత‌ను 30 ఏళ్ల నుంచి పెళ్లి కూతురిలా ముస్తాబవుతున్నాడు. చీరకట్టుకుని తనని తాను అందంగా సింగారించుకుంటున్నాడు.

అతడు అలా తయారవ్వడానికి ముందు కొన్ని భయానక ఘటనలు చోటుచేసుకున్నాయి.

చౌహాన్‌కు 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మొదటి భార్య చనిపోయింది.

తర్వాత అతడు పశ్చిమ బెంగాల్‌లోని దినాజ్పూర్‌లో ఇటుకల బట్టీలో పనిచేయడానికి వెళ్లాడు.

ఈ సందర్భంగా అతడికి ఓ షాపు యజమానితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల తర్వాత చౌహాన్ ఆ వ్యాపారి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఆ పెళ్లికి చౌహాన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అతడు ఆమెను విడిచిపెట్టి యూపీలోని సొంత ఊరికి వెళ్లిపోయాడు.

ఈ మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఏడాది తర్వాత చౌహాన్‌కు తెలిసింది.

కుటుంబ సభ్యుల ఒత్తిడితో చౌహాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి చౌహాన్‌కు ‘హర్రర్’ సినిమా కనిపించడం మొదలైంది.

మూడో పెళ్లి జరిగిన కొద్ది నెలల తర్వాత చౌహాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడం మొదలైంది.

ముందు అతడి తండ్రి జియావన్, అన్నయ్య చొటావు, భార్య ఇంద్రావతి, ఇద్దరు కొడుకులు, తమ్ముడు బదావు చనిపోయారు. ఆ మరణాలు అంతటితో ఆగలేదు.

ఆ తర్వాత అతడి సోదరుల ముగ్గురు కుమార్తెలు, నలుగురు కొడుకులు సైతం చనిపోయారు.

ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ‘‘రోజూ నా రెండో (బెంగాలీ) భార్య కలలోకి వ‌చ్చేది. ఆమె మరణానికి నేనే కారణమని చెప్పింది.

నేను మోసం చేయడం వల్లే తాను చనిపోయానని గట్టిగా ఏడ్చిది. ఓ రోజు ఆమెను కలలోనే క్షమించాలని వేడుకున్నాను.

నా కుటుంబాన్ని వదిలిపెట్టాలని కోరాను. దీంతో ఆమె పెళ్లి కూతురు దుస్తులు వేసుకుని త‌న‌ను నాతోనే ఉంచుకోవాలని కోరింది.

అప్పటి నుంచి నేను పెళ్లి కూతురు దుస్తుల్లోనే ఉంటున్నా. ఆ రోజు నుంచి నా ఆరోగ్యం బాగుపడింది.

ఇంట్లో మరణాలు కూడా ఆగాయి. మిగతా కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం నుంచి బయటపడ్డారు.

నన్ను ఈ దుస్తుల్లో చూసి అంతా నవ్వుకుంటారు. కానీ కుటుంబం కోసమే నేను ఇలా చేస్తున్నాను. వారిని రక్షించేందుకే నేను ఈ దుస్తులు ధరిస్తున్నాను’’ అని తెలిపాడు.