కోహ్లీ ఇంట్లో ప‌ని మనుషులుండ‌ర‌ట‌

263

చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన వ్య‌క్తి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. పేరు ప్ర‌ఖ్య‌తుల‌తో పాటు కోట్లాది రూపాయ‌లు కూడా సంపాదించుకున్నాడు. అలాంటి వ్య‌క్తి ఇంట్లో ప‌ని మ‌నుషులుండ‌రంటే న‌మ్ముతారా?

కానీ ఇది నిజ‌మ‌ని అంటున్నారు మాజీ క్రికెట‌ర్, మాజీ సెలెక్ట‌ర్ శ‌ర‌ణ్ దీప్ సింగ్‌. మైదానంలో ప్ర‌త్య‌ర్థి అట‌గాళ్ల‌తో సై అంటే సై అనే కోహ్లీ మైదానం బ‌య‌ట మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటాడ‌ట‌.

మైదానంలో కోహ్లీ దూకుడును చూసి అత‌నికి కోపం ఎక్కువ‌ని అంద‌రూ అనుకుంటుంటారు. కానీ మైదానం బ‌య‌ట అత‌ను ఎంతో ప్ర‌శాంతంగా ఉంటాడ‌ని శ‌ర‌ణ్ దీప్ చెబుతున్నారు.

ఎవ‌రేం చెప్పినా శ్ర‌ద్ధగా వింటాడు

ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో శరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ… ‘మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీని చూస్తే అత‌ను కోపిష్టి అనుకుంటాం. కానీ ఆఫ్ ది ఫీల్డ్‌లో‌ మాత్రం ఎంతో వినయంగా ఉంటాడు.

తను మంచి శ్రోత. ఎవరేం చెప్పినా విసుక్కోకుండా వింటాడు. సెలక్షన్‌ మీటింగ్స్‌లో అందరూ చెప్పేది చాలా శ్రద్ధగా వింటాడు.

గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అందరూ చెప్పేది ఎంతో శ్రద్ధగా విని.. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు’ అని శ‌ర‌ణ్ దీప్ చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న కోహ్లీ అహ్మదాబాద్‌లో ఉన్నాడు.

ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.

ఇంట్లో ప‌నోళ్లు ఉండ‌రు.

కోహ్లీ ఇంట్లో ప‌నోళ్లు ఉండ‌ర‌ని శ‌ర‌ణ్ దీప్ అన్నారు. ‘మైదానం బయట విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. విరాట్ భార్య అనుష్క శర్మతో కలిసి ఉండే ఇంట్లో అసలు పనోళ్లే ఉండరు.

ఇంటికి వెళ్లిన వారికి విరాట్, అనుష్క స్వ‌యంగా అతిథి మ‌ర్యాద‌లు చేస్తారు. అంతకంటే ఆతిథ్యం ఏముంటుంది.

అంతేకాదు ఇంటికి వచిన వారితోనే కూర్చుని మాట్లాడతాడు. అతిథులతోనే కలిసి బయటకు విందుకు వస్తాడు. మిగతా ఆటగాళ్లందరికీ కోహ్లీ అంటే ఎంతో గౌరవం.

అతను ఎంతో ఎత్తుకు ఎదిగినప్ప‌టికీ చాలా సాధారణంగా ఉంటాడు’ అని శరణ్‌దీప్ చెప్పారు. ఆటతో పాటు ఆదాయంలోనూ గత కొన్నేళ్లుగా కోహ్లీ టాప్‌లో దూసుకెళ్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్-100 అథ్లెట్స్ జాబితాలో గత ఏడాది కోహ్లీ 66వ స్థానంలో ఉన్నాడు.అనుష్క శర్మతో చాలారోజులు ప్రేమాయణం నడిపిన కోహ్లీ.. 2017 చివర్లో ఇద్దరూ ఒకటయ్యారు.

పెళ్లి తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది. కోహ్లీ, అనుష్క జంట‌కు ఈ ఏడాది జనవరిలో కూతురు పుట్టింది.