మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. మంచు విష్ణు, శ్రియ, అనసూయ భరద్వాజ్, నిఖిలా విమల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మదన్ రామిగాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాయత్రి’ థియేట్రికల్ ట్రైలర్ ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మోహన్‌బాబు నటన అమోఘం అని అనిపిస్తుంది. యాక్షన్, డైలాగ్స్ పాత మోహన్‌బాబును గుర్తుచేస్తాయి.
ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో మోహన్‌బాబు ఖైదీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది.. భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది’ అంటూ మోహన్‌బాబు చెప్పిన డైలాగు అద్భుతంగా ఉంది. ఇదే కాదు.. ట్రైలర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘అది వదలే రకం కాదు.. నేను దొరికే రకం కాదు’, ‘అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నవ్వు’, ‘దేవుడు చాలా మంచి వాడు రాక్షసులకు కూడా వరాలు ఇస్తుంటాడు’, ‘కత్తో.. కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు. కానీ, నటుడు అందరూ కాలేరు’, ‘నేను వెయ్యరాని పాత్ర వేస్తున్నానో, చెయ్యరాని తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు’ ఇలా ప్రతి డైలాగ్ హైలైట్‌గా ఉన్నాయి.
ఈ చిత్రానికి యంగ్ తరంగ్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 42వ చిత్రమిది.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గాయత్రి’ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకొంటోంది.