తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన “సూరారై పోట్రు” సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ సినిమా తెలుగులో “ఆకాశం నీ హద్దురా” పేరుతో విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.
కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు.
కాగా “సూరారై పొట్రు” (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అరుదైన ఘనత లభించింది.
మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి ఎంటర్ అయ్యింది.
93వ ఆస్కార్ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ట్విటర్‌లో పేర్కొంది.
మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను ఆస్కార్ అవకాడమీ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలో మార్చి 5 నుంచి 10 వరకు ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. తుది జాబితాలోని విజేత చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు.
జనరల్ కేటగిరీలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్‌తో కేటగిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సూర్య 40గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న సూర్య త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.