
పాస్‌పోర్ట్ కుంభకోణం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. తీగ లాగితే డొంక కదులుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పాస్‌పోర్టుల జారీలో పోలీసు లింకులు ఉన్నట్లు బయటపడుతోంది.
తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులకు అవినీతి పోలీసు అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పాస్‌పోర్టులిప్పించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ స్వయంగా బయట పెట్టారు.
అక్రమంగా దేశంలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులకు హైదరాబాద్ సహా తెలంగాణ అడ్డాగా మారిందన్న సంకేతాలు తాజా పాస్‌పోర్టుల కుంభకోణంలో వెలుగు చూశాయి. ఈ వ్యవహారంలో వెల్లడవుతున్న అంశాలతో పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో వెలుగు చూసిన పాస్‌పోర్టుల స్కామ్ వివరాలను సీపీ సజ్జన్నార్ సోమవారం మీడియాకు వివరించారు. ‘ తప్పుడు పత్రాలు పెట్టి పాస్ పోర్టులను తీసుకున్నారు.
ఓకే ఇంటిపై 70కి పైగా పాస్ పోర్ట్‌లు జారీ అయ్యాయి.. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాస్ పోర్టులు జారీ అయినట్టుగా గుర్తించాం. పాస్ పోర్టుల జారీలో పోలీసుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం.
ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. నలుగురు బంగ్లాదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నాం. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు తెలంగాణలోని పలు ప్రాంతాలలో పాస్ పోర్టులు తీసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాస్ పోర్టులను గుర్తించి, వాటిని సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటపడింది.. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఇంకా ఎవరెవరు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు కలిగి ఉన్నారన్న దానిపై విచారణ జరుపుతున్నాం.
తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్న వారు దేశం దాటి బయటికి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. ఇప్పటికే కొన్ని లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశాం’ అని సీపీ సజ్జన్నార్ వివరించారు.
తప్పుడు పత్రాలతో పాస్ పోర్టుల జారీ వ్యవహారంపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. పాస్‌పోర్టుల వ్యవహారంలో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో నలుగురు బంగ్లాదేశీయులుకాగా.. ఒకరు బెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఉన్నారు. నిజానికి బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో హైదరాబాద్ చేరుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పలు మార్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
తాజా సంఘటనతో అది ధృవీకరణ అయ్యింది. అక్రమంగా బంగ్లా బోర్డర్ దాటే వారికి అక్కడే ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ వుందని పలు సందర్భాలలో వెల్లడైంది. ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులను పోలీసులు అప్రమత్తం చేశారు.
ఇప్పటి వరకు ఎంత మంది దేశం దాటి వెళ్ళారు.. ఎంత మంది పాస్ పోర్టులను పొందారు అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టు చేసిన వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
స్థానికుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గంలో తెలంగాణకు వచ్చి ఇక్కడ ధృవీకరణ పత్రాలు పొందిన వారికి స్థానికంగా సహకరించిన అధికారులు, ప్రజల గురించి కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.
తూతూ మంత్రంగా దృవ పత్రాల వెరిఫికేషన్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.