పెట్రోల్ ధరలను తగ్గించిన రాష్ట్రాలు

287

వాహ‌న‌దారుల‌కు కొంత ఊర‌టనిచ్చే అంశ‌మిది. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను కొన్ని రాష్ట్రాలు త‌గ్గించాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర రూ. 100 దాట‌గా.. కొన్ని రాష్ట్రాల్లో సెంచ‌రీకి చేరువ‌య్యాయి.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం ప్ర‌తిప‌క్షాలకు ఓ ఆయుధంలా ల‌భించింది. ప్ర‌భుత్వంపై అవి విరుచుకుప‌డుతున్నాయి.

ఇంధ‌నం ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరుకున్న నేప‌థ్యంలో ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించాల‌ని కేంద్రంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. పెరుగుతున్న ఇంధ‌నం ధ‌ర‌ల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది పడుతున్న నేప‌థ్యంలో నాలుగు రాష్ట్రాలు ప‌న్ను త‌గ్గించి వాహ‌నదారుల‌కు ఊర‌ట క‌లిగించాయి.

త్వ‌ర‌లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గాయి.

దాదాపు రూ.5 మేరకు వినియోగదారులకు ఊరట లభించింది. తొలుత జనవరి 29 న రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది.

ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో లీటరుకు ఒక రూపాయి తగ్గింపును మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం కరోనా సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన 5 రూపాయల అదనపు పన్నును కూడా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 12న తొలగించింది.

అదే సమయంలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 7.40, డీజిల్‌పై రూ. 7.10 తగ్గించాలని నిర్ణయించింది.

ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కానీ కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గడం వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ.. చమురు ధరల‌ పెరుగుదల ప్రభుత్వం నియంత్రణలో లేద‌ని తేల్చి చెప్పారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారే త‌ప్ప‌.. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి మాత్రం ముందుకు రావ‌డం లేదు.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

  • న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ రూ 80.97.
  • ముంబైలో పెట్రోల్ రూ .97.00, డీజిల్ రూ .88.06.
  • కోల్‌కతాలో పెట్రోల్ రూ .91.78, డీజిల్ రూ .84.56.
  • చెన్నైలో పెట్రోల్ రూ .92.59, డీజిల్ రూ .85.98.
  • నోయిడాలో పెట్రోల్ రూ .88.92, డీజిల్ రూ .81.41.
  • బెంగళూరులో పెట్రోల్ రూ .93.61, డీజిల్ 85.
  • భోపాల్‌లో పెట్రోల్ రూ .98.60, డీజిల్ రూ .89.23.
  • చంఢీఘర్‌‌లో పెట్రోల్ రూ .87.16, డీజిల్ రూ .80.67.
  • పాట్నాలో పెట్రోల్ రూ .92.91, డీజిల్ రూ .86.22.
  • లక్నోలో పెట్రోల్ రూ .88.86, డీజిల్ రూ .81.35.