రండమ్మా.. రండి

249

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రండ‌మ్మా.. రండి అని మ‌హిళ‌ల‌ను పిలుస్తున్నారంట‌. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ఈయ‌న ఊద‌ర‌గొడుతున్నాడంట‌.

త‌మ పార్టీలో చేతిలో త‌న ఆస్ప‌త్రిలో ఉచితంగా కాన్పులు చేస్తామ‌ని కూడా ఆయ‌న మ‌హిళ‌ల‌కు బంప‌ర్ ఆఫర్ ఇస్తున్నారంట‌. వివ‌రాల్లో వెళితే.. తెలంగాణ రాష్ట్ర సమితిని బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నేతలకు టార్గెట్ పెట్టారు.

ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక్కో నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టారు. దీంతో ఆ ల‌క్ష్యాన్ని సాధించేందుకు నేతలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాత్రం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రభుత్వం నుంచి అందించే పథకాల్లో పెద్దపీట వేస్తామని చెబుతున్నారు.

అలాగే తన సొంత ఆస్పత్రుల్లో వైద్య సేవల పరంగా ఆఫర్లు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెబుతున్న రాజయ్య.. తన సొంత ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారికి వైద్య పరీక్షల్లో 20 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు.

డెలివరీల కోసం ఆంబులెన్స్‌లను ఇంటికి పంపిస్తామని, తమ ఆస్పత్రిలో డెలివరీ అయిన వారికి ఆడబిడ్డ పుడితే వారి నుంచి ఎలాంటి ఫీజులు తీసుకోబోమని, ఒకవేళ మగబిడ్డ పుడితే వారి నుంచి 50 శాతం ఫీజు మాత్రమే తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూసుకొస్తున్న వేళ మళ్లీ మూలాలకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతోంది.

నేతలకు టార్గెట్ ఇచ్చి మరీ సభ్యత్వాలను చేయిస్తోంది. దీంతోపాటు ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎక్కువ సభ్యత్వాలు జరుగుతాయో ఆ నియోజకవర్గంలో సభను నిర్వహిస్తానని చెప్పారు.

అలాగే, ఆయా జిల్లాల నేతలు కూడా అందు కోసం పెద్ద ఎత్తున కృషి చేయాలన్నారు.