నగ్నంగా బైక్ రైడింగ్

673

రోడ్ల‌పై ర్యాష్ డ్రైవింగ్ చూశాం. బైక్‌ల‌తో స్టంట్స్ చేయ‌డమూ చూశాం. కానీ న‌గ్నంగా బైక్ న‌డ‌ప‌డం చూశామా? అందులోనూ హైద‌రాబాద్‌లో.

అవునండి! ఓ వ్య‌క్తి న‌గ్నంగా బైక్ రైడ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే..హైదరాబాద్‌లో సీసీ కెమెరాలకు కొదువ‌లేదు.

నిఘా నేత్రాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో ఉంది. నగర పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లలో ప్రభుత్వమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

అందుకే చీమ చిటుక్కుమ‌న్నా కెమెరాల్లో రికార్డవుతుంది. నగరంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు పోలీసులు అప్పుడప్పుడూ కెమెరా ఫుటేజీ ప‌రిశీలిస్తుంటారు.

ఈ క్రమంలో ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ యువకుడు నగ్నంగా బైక్‌పై సంచరిస్తున్న‌ట్టు కనిపించాడు.

అది నిజమో కాదో నిర్ధారించుకునేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అప్పుడు మ‌నోడి వ్యవహారం బయటపడింది

.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి ప్రాంతంలో ఓ యువకుడు నగ్నంగా బైక్ నడిపాడు.

మారేడ్‌పల్లి నుంచి నేరెడ్‌మెంట్ రూట్‌లో శరీరంపై బట్టలు లేకుండా సంచరించడంతో స్థానికులు షాక్ తిన్నారు.

ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ శ్రవణ్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మతిస్థిమితం లేని ఓ యువకుడు లంగర్‌‌హౌస్ ప్రాంతంలో ఓ బైక్‌ను చోరీచేశాడు.

ఆ బైక్‌పై లంగర్‌హౌస్ నుంచి తిరుమలగిరి వైపు వచ్చాడు. ఆర్మీ రోడ్లపై నగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేశాడు.

అనంతరం అదే బైక్‌పై సనత్‌నగర్ వైపు వెళ్లాడు. ఎవరూ లేని చోటు చూసి బైక్‌ను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

అతడు ఎందుకిలా చేశాడన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మతిస్థిమితం లేకపోవడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.