రైతుల ఉద్యమంపై పోర్న్ స్టార్ వ్యాఖ్యలు

344
Mia Khalifa Reiterates Support For Farmers’ Protest Amid Trolling

దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న ఓ అంశంపై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా స్పందించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మియా ఖలీఫా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గత కొన్ని నెలలుగా ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి పలువురు సెలెబ్రిటీలు మద్దతు ఇస్తుండగా, మరికొందరు సెలెబ్రిటీలు మాత్రం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై మియా ఖలీఫా ట్వీట్స్ చేసింది. ‘స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్’ అనే ప్లకార్డు పట్టుకున్న రైతుల ఫొటోను షేర్ చేస్తూ “ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది? ఢిల్లీలో ఇంటర్నెట్ ఎందుకు కట్ చేశారు?” అని ప్రశ్నిస్తూ #FarmersProtest అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది. దీంతో కొంతమంది ఆమెను ట్రోల్ చేశారు.

తనపై వస్తున్న ట్రోల్స్ కు మియా రియాక్ట్ అవుతూ ”నేను స్ప్రహలోనే ఉన్నా. అనవసరంగా నాపై మీరు చేస్తున్న ఆందోళనలకు ధన్యవాదాలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా” అని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇంతకుముందు అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్న కూడా ఈ విషయంలో రైతులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.