కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తోన్న విషయం తెలిసిందే.
ట్వీట్ల జాబితాలో బ్రిటిష్ నటి జమీలా జమిల్ కూడా ఉంది. అయితే ఆమె రైతులకు మద్దతు తెలిపినప్పటి నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేసింది.
కొన్ని నెలలుగా తాను తరచుగా భారతీయ రైతులకు మద్దతు తెలుపుతున్నానని ఆమె చెప్పింది. అయితే, ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, తనను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెప్పింది.ఇటువంటి బెదిరింపులకు పాల్పడేవారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆమె కోరింది.
తానూ మనిషినేనని, కొంతవరకే దేన్నయినా భరించగలనని తెలిపింది. భారత రైతులకు తాను సంఘీభావం తెలుపుతున్నానని, భవిష్యత్తులోనూ తెలుపుతానని స్పష్టం చేసింది. తమ న్యాయమైన హక్కుల కోసమే రైతులు పోరాడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని ఆమె పేర్కొంది.